Bharat Aawaz

కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
20
Views

కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

 

గుండ్లరేవులో ఘనంగా 20వ వర్ధంతి సభ

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ 20వ వర్ధంతి సభను జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలో తాటి నరసింహారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ.. ప్రజాపంథా పార్టీ నిర్మాణానికి మండలంలో విశేష కృషి చేసిన నాయకుడు మలకం చంద్రశేఖర్ అని కొనియాడారు.

 

దేశంలో పీడనలేని సమసమాజ స్థాపన, సామాజిక మార్పు, అణగారిన వర్గాల జీవితాల అభివృద్ధి, భూమి భుక్తి, దేశ విముక్తి కోసం సాగిన పోరాటాల్లో చంద్రశేఖర్ చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. 1996లో ఏన్కూరు–జూలూరుపాడు సంయుక్త మండల కమిటీ ఏర్పడి పనిచేస్తున్న సమయంలో పార్టీ నాయకత్వానికి పరిచయమై, 2006 వరకు కూలిరేట్ల పెంపు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, భూమి కోసం జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారని తెలిపారు.

 

నేడు దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అన్ని రంగాల్లో విస్తరిస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతోందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో సోషలిస్టు రాజ్య స్థాపన కోసం జరుగుతున్న పోరాటాల్లో భాగస్వాములు కావడమే కామ్రేడ్ చంద్రశేఖర్‌కు అర్పించే నిజమైన నివాళి అని కార్యకర్తలకు సూచించారు.

 

అమరవీరులకు ఘన నివాళులు

 

సభకు ముందు మలకం చంద్రశేఖర్ స్థూపంపై పార్టీ సీనియర్ నాయకుడు మలకం వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ మండల కమిటీ, గ్రామ శాఖ నాయకత్వంలో అమరవీరులకు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.

 

ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి తాటి నరసింహారావు, మండల నాయకులు తోటకూరి నరేష్, పార్టీ నరసింహారావు, బానోతు ధనవంతరావు, తెల్లని కృష్ణయ్య, మలకం సతీష్, ముక్తి జగదీష్, వరుస రామకృష్ణ, గొగ్గల భద్రయ్య, ప్రవీణ్, గుగులోతు బాలకోటి, లింగస్వామి, బాబు, ప్రశాంత్, కృష్ణయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.