Bharat Aawaz

పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించే వరకు ఉచిత శిక్షణ కొనసాగింపు గ్రాండ్ టెస్ట్‌కు 713 మంది అభ్యర్థుల హాజరు మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
5 min read
0
Comments
95
Views

మంచిర్యాల: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ, వారు లక్ష్యాలను సాధించే వరకు ఉచిత శిక్షణ, గ్రాండ్ టెస్టులను నిరంతరాయంగా కొనసాగిస్తామని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తెలిపారు.జిల్లా కలెక్టర్, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా యంత్రాంగం, రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్‌ఐతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. సుమారు 500 మంది అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తూ హైదరాబాద్‌కు చెందిన నిపుణులైన ఫ్యాకల్టీతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.శిక్షణలో భాగంగా అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసేందుకు నిర్వహించిన గ్రాండ్ టెస్ట్‌కు మొత్తం 713 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణను డీసీపీ ఎ.భాస్కర్ స్వయంగా పరిశీలించి, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరీక్ష నిర్వహణ విధానంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.డీసీపీ మాట్లాడుతూ రాబోయే నవంబర్ చివరి వారంలో, డిసెంబర్ 19న జరగనున్న కానిస్టేబుల్, ఎస్‌ఐ పరీక్షల వరకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు ప్రతి గ్రాండ్ టెస్ట్‌ను నిజమైన పోటీ పరీక్షగా భావించి రాయాలని, పరీక్ష అనంతరం తమ తప్పులను విశ్లేషించుకుని సరిదిద్దుకోవాలని సూచించారు.గ్రాండ్ టెస్టుల అనంతరం సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేక విశ్లేషణ తరగతులు నిర్వహిస్తున్నామని, ప్రశ్నపత్రం విశ్లేషణ, సమయపాలన, ప్రశ్నలను అర్థం చేసుకోవడం, సరైన సమాధానాలను ఎంపిక చేసుకోవడం, తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయడం, పరీక్షల ఒత్తిడిని అధిగమించడం వంటి అంశాలపై ప్రత్యేక మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ శిక్షణ కేవలం పోలీస్ ఉద్యోగాలకే పరిమితం కాదని, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, ఎన్‌డీఏ, యూపీఎస్సీ, టీజీపీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా అభ్యర్థుల్లో ప్రాథమిక పరిజ్ఞానం, పరీక్షా నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు.యువత తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, విజయం సాధించే వరకు పట్టుదలతో కృషి చేయాలని డీసీపీ పిలుపునిచ్చారు. ఒక్కసారి పరీక్షలో విజయం సాధించకపోయినా నిరుత్సాహపడకుండా, చేసిన తప్పులను గుర్తించి మరింత కష్టపడి తదుపరి అవకాశానికి సిద్ధం కావాలని సూచించారు. క్రమశిక్షణ, నిరంతర సాధన, సమయపాలన, సరైన మార్గదర్శకత్వం ఉంటే ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను సైతం సాధించవచ్చని అన్నారు.ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న నోడల్ అధికారి, బెల్లంపల్లి ఆర్‌ఐ సంపత్‌తో పాటు ఆయన సిబ్బందిని డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణతో పాటు భోజనం, వసతి, పరీక్షా సౌకర్యాలు కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు ప్రశంసించారు.జిల్లా పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని డీసీపీ ఎ.భాస్కర్ ఆకాంక్షించారు.