Bharat Aawaz

మద్యం మత్తులో కుమారుడి హత్య చేసిన కన్న తండ్రి.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
100
Views

 

● శిల్పినగర్‌లో విషాద ఘటన.. ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా కనిపించిన బాలుడు

● హత్య కేసు నమోదు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం బోరబండ పోలీసుల గాలింపు

అల్వాల్, నవంబర్ 2: మద్యం మత్తులో కన్న కొడుకునే గొంతు నులిమి హత్య చేసిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ జోన్, ఎస్‌ఆర్ నగర్ డివిజన్ బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధి శిల్పినగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. విద్యాసాగర్ (36) తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌ను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో విద్యాసాగర్ మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

ఆ సమయంలో బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్ పనుల నిమిత్తం బయటకు వెళ్లింది. సోమవారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన ఆమెకు కుమారుడు మృతి చెంది కనిపించడంతో దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులకు సమాచారం అందిన విషయం తెలుసుకున్న విద్యాసాగర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద హత్య కేసు నమోదు చేసి, నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలుడి హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#Sidhumaroju

Alwal