Bharat Aawaz

కొత్తగూడెంలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజు.

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
131
Views

కొత్తగూడెం: పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా కొత్తగూడెంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు.

 

పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా శుక్రవారం కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను ప్రజలకు తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సైకిల్, బైక్ ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలతో పాటు అన్ని సబ్ డివిజన్ల పరిధిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

 

రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో విద్యార్థులు, యువకులు, మహిళలు, రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం పండ్లు, పండ్ల రసాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్ , డీఎస్పీలు ఆదినారాయణ, మల్లయ్య స్వామి, సత్యనారాయణ, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్ అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.