ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్న ఆంధ్ర శబరిమలై..

0
553

 

ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లుతున్న ఆంధ్రా శబరిమలై

పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా శివుడు–ఆంజనేయస్వామి విగ్రహాలు

అందరిలో ఆధ్యాత్మికతత్వం పెంపొందించడమే ధ్యేయం: ఆలయ ట్రస్టు చైర్మన్ భూపతి కుసుమంచి శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి...

 

శంఖవరం: కాకినాడ జిల్లాలోని మెట్ట ప్రాంతమైన శంఖవరం మండలంలోని సబ్ ప్లాన్ ముఖద్వారమైన పెదమల్లాపురం పంచాయతీ పరిధిలోగల సిద్ధివారిపాలెం, అంకంపాలెం గ్రామాల మధ్య కొలువైన ఆంధ్రా శబరిమలై అయ్యప్పస్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. ప్రకృతి రమణీయమైన నాగులకొండల పర్వత శ్రేణుల మధ్య సుమారు లక్ష గజాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక చైతన్యానికి, పర్యాటక ఆకర్షణకు నిలయంగా మారింది.

కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ శబరిమలై ఆలయాన్ని పోలిన నిర్మాణ శైలిలో సన్నిధానం రూపుదిద్దుకోవడం ప్రత్యేకత. పర్వత మధ్యన సుందరంగా ఇమిడిన ఈ ఆలయం భక్తుల్లో భక్తి భావాన్ని, ప్రకృతి మధ్య ఆత్మశాంతిని కలిగిస్తోంది. సమీప ఆంకంపాలెంలోని ఉషాద్రి పర్వతం వద్ద నిర్మించిన పందళ రాజ్య భవంతి ఆలయానికి మరింత వైభవాన్ని తెచ్చిపెడుతోంది. ఇందులో అయ్యప్పస్వామి జీవిత విశేషాలను ప్రతిబింబించే శిల్పాలు, చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ఆలయ ప్రాంగణంలో గణపతి, పార్వతీదేవి, కుమారస్వామి, శ్రీరాముడు, హనుమంతుడు వంటి ఉపాలయాలు నిర్మించి సమగ్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించారు. భక్తులు ముందుగా మల్లికార్జుని లోద్దిలో నాగులకొండల నుంచి జాలువారే సహజ జలధార కింద పుణ్యస్నానం ఆచరించి, అనంతరం ఉపాలయాలను దర్శించుకొని అయ్యప్పస్వామి సన్నిధికి చేరుకుంటున్నారు.

ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష బూనిన మాలధారులు పందళ రాజ్యం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల వనయాత్ర నిర్వహించడం విశేషం. శరంగుత్తి వద్ద భక్తులు అభిషేకాలు చేసి, 18 పవిత్ర మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం భక్తి పరాకాష్టగా నిలుస్తోంది. మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారి సన్నిధిలో జ్యోతి దర్శనం పొందిన భక్తుల ఆనందం వర్ణనాతీతమని భక్తులు చెబుతున్నారు.

ఇటీవల పర్వత శిఖరంపై ఏర్పాటు చేసిన భవ్యమైన శివుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు దర్శనార్థులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎత్తైన ప్రదేశంలో ప్రతిష్ఠించిన ఈ విగ్రహాలు భక్తుల్లో మరింత ఆధ్యాత్మిక స్పూర్తిని నింపుతున్నాయి. సాయంత్ర వేళల్లో దీపాలంకరణల మధ్య పర్వతం సోయగం మరింత వెలిగిపోతూ దర్శనార్థులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.

ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య పూజలతో పాటు పర్వదినాల్లో విశేష అర్చనలు, భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో భక్తులకు తాగునీరు, విశ్రాంతి గదులు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. “ప్రజల్లో అయ్యప్ప తత్వాన్ని పెంపొందించడం ద్వారా దైవభక్తి, సేవాభావం, సామాజిక సమానత్వం పెరుగుతాయి. అదే మా ప్రధాన లక్ష్యం” అని ట్రస్టు చైర్మన్ భూపతి కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు.

భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండడంతో ఈ ప్రాంతంలో చిన్న వ్యాపారాలు, రవాణా సదుపాయాలు అభివృద్ధి చెందుతూ స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకాభివృద్ధికి దోహదపడుతున్న ఆంధ్రా శబరిమలై, జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా మరింత ఖ్యాతి గడిస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం
కృష్ణా జిల్లా పోలీస్    *మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక...
By Rajini Kumari 2026-02-23 14:11:57 0 214
Andhra Pradesh
పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ వాహనాలు ప్రారంభించిన వెంకయ్య నాయుడు
Breaking..                       ...
By Rajini Kumari 2026-01-25 11:00:47 0 224
Andhra Pradesh
పల్లె పండగ ద్వారా గ్రామాల అభివృద్ధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
*పత్రికా ప్రకటన*   *పల్లె పండుగతో గ్రామాలకు సరికొత్త సంక్రాంతి శోభ*   *జిల్లాలో...
By Rajini Kumari 2026-01-13 16:08:18 0 238
Telangana
ఎన్ సి ఆర్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర...
By Sidhu Maroju 2026-01-06 10:09:48 0 230
Andhra Pradesh
వృద్ధుడు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు
సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక సత్యం(60) రెండు రోజులుగా కనిపించకుండా పోయారు....
By Boiena Rajesh 2026-09-11 06:03:15 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com