Bharat Aawaz

కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
18
Views

బెల్లంపల్లి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగది, భోజనశాలను పరిశీలించి విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థినులకు గణితంలో అందిస్తున్న బోధనను పరిశీలించారు. విద్యార్థినుల అభ్యసన స్థాయిని తెలుసుకుని, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.అనంతరం బెల్లంపల్లి సబ్ కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా ఆక్రమణలు గుర్తిస్తే వెంటనే స్పందించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని కృష్ణా మందిర్ రోడ్ నంబర్ 2లో ధనలక్ష్మి ట్రేడర్స్ ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను జిల్లా పౌరసరఫరాల అధికారి, మండల తహసీల్దార్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం తాండూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్‌తో కలిసి సందర్శించి ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తులను సంబంధిత రికార్డులతో క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వివిధ ధ్రువపత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను కూడా నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు అధికారులు నిరంతరం బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.