Bharat Aawaz

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తా.. పలాసను ప్రగతి పథంలో నిలుపుతా!

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
5 min read
0
Comments
68
Views

​• పలాస జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బొమ్మిడి దుర్యోధనరావు (బీడీ రావు)

​• పార్టీ అధిష్టానానికి, నియోజకవర్గ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు

​• 'కత్తి కంటే కలం గొప్పది' అనే సిద్ధాంతంతోనే నా ప్రయాణం: బీడీ రావు

​పలాస:

పలాస మండల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా పరిషత్‌లో ప్రజా గొంతుకనై నినదిస్తానని పలాస మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బొమ్మిడి దుర్యోధనరావు (బీడీ రావు) స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు దాసన్న గారికి, మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి, జిల్లా, మండల స్థాయి నాయకులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

​విలువల రాజకీయాలే నా ఊపిరి

​"కత్తి కంటే కలం గొప్పది" అనే నానుడిని బలంగా నమ్ముతానని, సిద్ధాంతాలు, విలువలకే ప్రాధాన్యమిస్తూ ప్రజాసేవ చేస్తున్నానని బీడీ రావు పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఎల్లప్పుడూ సేవా దృక్పథమే ఆదర్శమని, 2014 ఎన్నికల్లో తమ మాతృమూర్తి బొమ్మిడి వరహాలమ్మ వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారని గుర్తుచేశారు. అనంతరం 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనివార్య కారణాల వల్ల పార్టీ టికెట్ దక్కకపోయినప్పటికీ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఘన విజయం సాధించానని తెలిపారు. ఆ విజయం ద్వారా పలాస మండలంలో ప్రజల మనిషిగా గుర్తింపు పొందానని వివరించారు.

​రైతాంగం, సామాన్యుల పక్షపాతిగా సేవా ప్రస్థానం

​తాను ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహించిన కాలంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం సాగించినట్లు వెల్లడించారు. ప్రతి మండల పరిషత్ సమావేశంలో ప్రజల తరఫున గళం విప్పానని, ముఖ్యంగా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడటంతో పాటు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పరిష్కారాలు చూపినట్లు వివరించారు. చిసంచల పరిధిలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తన సేవా దృక్పథం ఎల్లప్పుడూ అందుబాటులో ఉందని గుర్తుచేశారు.

​ద్వేషం లేని రాజకీయం.. సమస్యల పరిష్కారమే లక్ష్యం

​రాజకీయాల్లో తనకు ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఎవరూ లేరని బీడీ రావు స్పష్టం చేశారు. ఇనుముకు పట్టిన తుప్పు దాన్ని ఎలా నాశనం చేస్తుందో, క్రూరత్వపు ఆలోచనలు మనిషి వ్యక్తిత్వాన్ని అలానే దెబ్బతీస్తాయని, అందుకే అందరినీ కలుపుకుపోయే సౌమ్యమైన స్వభావంతో రాజకీయాలు చేస్తున్నానని పేర్కొన్నారు. పలాస మండలంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ప్రతి గ్రామంలోని మౌలిక వసతుల కొరతను సమగ్రంగా గుర్తించి, జిల్లా పరిషత్ వేదికగా వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

​ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి

​పలాస మండల ప్రజల ఆశీస్సులు తనపై ఉంచి జడ్పీటీసీగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పలాస మండల పరిధిలోని 11 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మండల ఓటర్లను కోరారు.