మంచిర్యాల నియోజకవర్గం:లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంచిర్యాల యువకుడిని జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. రాజ్ కిరణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా యువకుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య సహాయం అందించి, ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా డా. రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదని పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని, సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నమ్మకమైన వ్యక్తుల సహాయం తీసుకోవాలని సూచించారు.లోన్ యాప్ల పేరుతో కొందరు నిర్వాహకులు రుణగ్రహీతలను బెదిరించడం, అసభ్యకరమైన సందేశాలు పంపడం, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధించడం వంటి చర్యలకు పాల్పడితే సహించకూడదన్నారు. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిపై సంబంధిత అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని వేధించడం అమానవీయమని, బాధితులకు సమాజం అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్నవారికి మనోధైర్యం కల్పించడం, వారి సమస్యలను పరిష్కరించేందుకు సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.బాధితులకు భరోసా ఇద్దాం.. లోన్ యాప్ వేధింపులపై గళమెత్తుదాం.. ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు మన వంతు కృషి చేద్దాం” అని డా. రాజ్ కిరణ్ పిలుపునిచ్చారు.