Bharat Aawaz

విలీనమైనా మారని నిర్మాణాల తీరు పంచాయతీ నిబంధనల పేరుతోనే నిర్మాణాలు.. సెట్బ్యాక్‌లు లేకుండా G+2, G+3 భవనాలు.పార్కింగ్ లేక.. రోడ్లపైనే వాహనాలు.

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
5 min read
0
Comments
181
Views

దుండిగల్–గండిమైసమ్మ మండలం, మల్లంపేట:సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మల్లంపేట గ్రామం విలీనమై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇక్కడ నిర్మాణాల తీరు మాత్రం ఇంకా పంచాయతీ నిబంధనల ప్రకారమే కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మల్లంపేటలో కొందరు బిల్డర్లు ఎలాంటి సెట్బ్యాక్‌లు వదలకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇరుకైన వీధుల్లో సైతం G+2, G+3 భవనాలు నిర్మిస్తూ, భవిష్యత్‌లో ఎదురయ్యే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నుంచి నిర్మాణ అనుమతులు పొందే సమయంలో నిబంధనలు పాటించాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

పార్కింగ్ లేక.. రోడ్లపైనే వాహనాలు ,ఇరుకైన వీధుల్లో G+3 భవనాలు నిర్మించినప్పటికీ, వాటిలో నివసించే కుటుంబాలకు సరిపడా పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. కొన్ని భవనాల్లో ఒక కారుకు మాత్రమే పార్కింగ్ స్థలం ఉండగా, మిగిలిన నివాసితులు తమ కార్లు, ద్విచక్ర వాహనాలను రోడ్ల ఇరువైపులా నిలిపివేస్తున్నారు.

దీంతో ఇప్పటికే ఇరుకుగా ఉన్న వీధులు మరింత కుచించుకుపోయి, ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఫైర్‌ ఇంజిన్లు వంటి వాహనాలు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల ప్రకారమే అనుమతులు ఇవ్వాలి

మల్లంపేట ప్రాంతం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైన నేపథ్యంలో, ప్రస్తుతం అమల్లో ఉన్న మున్సిపల్ నిర్మాణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సెట్బ్యాక్‌లు, పార్కింగ్, రోడ్డు వెడల్పు తదితర నిబంధనలను పరిశీలించిన తర్వాతే నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మల్లంపేటలో అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు