" ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?

0
528

హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక వ్యాసం.  

తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ఒక ఐపీఎస్ అధికారి యూనిఫామ్ విడిచి, ఖద్దరు కండువా కప్పుకోవడం ఒకప్పుడు పెద్ద సంచలనం. 

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీగా ‘స్వేరోస్’ అనే ఒక బలమైన సామాజిక సామ్రాజ్యాన్ని నిర్మించి, వేలాది మంది నిరుపేద విద్యార్థుల గుండెల్లో ఆశలు నింపిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 

అదనపు డీజీపీ హోదాలో ఐదేళ్ల సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆయన రాజకీయాల్లోకి రావడం వెనుక తెలంగాణ బహుజన సమాజం ఒక కొత్త ఆశాజ్యోతిని చూసింది.

సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఒక విద్యాధికుడు, ఉన్నత అధికారి సమాజ మార్పు కోసం వస్తున్నాడనే నమ్మకం అందరిలోనూ కలిగింది.

కానీ, బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రారంభమై నేటి బీఆర్ఎస్ అగ్రెసివ్ వాయిస్ వరకు సాగిన ఆయన రాజకీయ ప్రయాణం.. 

ఒక మేధావి పొలిటికల్ అత్యాశకు, భ్రమలకు నిదర్శనంగా నిలిచిందనే చర్చ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బలంగా నడుస్తోంది.

ఉద్యోగానికి రాజీనామా చేసిన కొత్తలో ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాట ఒక తుపాకీ బుల్లెట్‌లా పేలింది. 

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను నయ వంచక గడీల పాలన అని, దోపిడీ దొరల సామ్రాజ్యం అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని, దళిత బంధు కేవలం ఎన్నికల స్టంట్ అని, కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని నమ్మించి గొంతు కోశారని ప్రవీణ్ కుమార్ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. 

తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనే నా లక్ష్యం అని, నిరుపేదలకు అధికారం దక్కే వరకు విశ్రమించనంటూ ఆయన చెప్పిన మాటలకు వేలాది మంది బహుజన యువకులు, మేధావులు ఆకర్షితులయ్యారు. 

ఆ సమయంలో ఆయన మాటలకు ప్రజల్లో ఒక నైతిక విలువ ఉండేది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, బీఎస్పీకి రాష్ట్రవ్యాప్తంగా ఒక ఊపు తెచ్చి బలమైన ఓటు బ్యాంకును సృష్టించగలిగారు.

అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే సామెతను ప్రవీణ్ కుమార్ చాలా వేగంగా వంటబట్టించుకున్నారు. 

పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆయన ఒక్కసారిగా తీసుకున్న యూ-టర్న్ అందరినీ షాక్‌కు గురిచేసింది. 

తాను ఏ కేసీఆర్‌నైతే గడీల దొర అని తిట్టారో, ఏ పార్టీనైతే దళిత ద్రోహి అన్నారో.. అదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పక్కన కూర్చుని గులాబీ కండువా కప్పుకున్నారు. 

మాయావతి ఒత్తిడి వల్లే బీఎస్పీని వీడానని సాకులు చెప్పినప్పటికీ.. కేవలం ఒక పార్లమెంట్ సీటు కోసం, రాజకీయ మనుగడ కోసం ఆయన తన బహుజన సిద్ధాంతాలను ప్రగతి భవన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారనే ముద్ర బలంగా పడిపోయింది. 

దీని ఫలితం ఎలా ఉందంటే, గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుండి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రవీణ్ కుమార్‌ను సొంత బహుజన వర్గాలే ఘోరంగా ఓడించాయి. 

ప్రజలు సిద్ధాంతాలను నమ్ముతారు కానీ, స్వార్థం కోసం ప్లేట్ తిరగేసే నాయకులను నమ్మరని ఆ ఎన్నికల ఫలితం స్పష్టం చేసింది. 

ఉద్యమ కాలం నుండి ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్, ఈటల రాజేందర్ లాంటి బలమైన నేతలనే అవసరం తీరాక సైడ్ చేసిన చరిత్ర కేసీఆర్‌కు ఉంది. 

అలాంటిది నిన్నగాక మొన్న వచ్చి చేరిన ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎప్పటికీ సొంత మనిషిగా చూడదనే కనీస సత్యాన్ని ఆయన గ్రహించలేకపోవడమే పెద్ద పొలిటికల్ బ్లండర్.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు, దిల్లీ లిక్కర్ స్కామ్ లతో పార్టీ అగ్రనేతలు రక్షణ ధోరణిలో ఉన్నారు. 

తాము నేరుగా మాట్లాడితే పాత కేసులు గుర్తుకొస్తాయనే భయంతో బీఆర్ఎస్ పెద్దలు తెరవెనుక దాక్కుని.. ఎలాంటి కేసులు లేని క్లీన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌ను మైకుల ముందుకు తోశారు. 

ప్రవీణ్ కుమార్ కూడా తానెదో పెద్ద హీరో అయిపోవచ్చనే భ్రమలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసును పూర్తిగా తన భుజాన వేసుకుని రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. 

హరీష్ రావు, కేటీఆర్ లాంటి సీనియర్లు మౌనంగా ఉన్న ఈ వివాదంలో, ప్రవీణ్ కుమార్ ఒక్కడే అతిగా విమర్శలు చేస్తుండటంతో జనాలు దీనిని ఒక రాజకీయ డ్రామాలాగా చూస్తున్నారే తప్ప, నిజాయితీ గల పోరాటంగా గుర్తించడం లేదు. 

ఒక హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి కేవలం ఒక కుటుంబ పార్టీ ప్రయోజనాల కోసం, మైకుల ముందు నిలబడి ఇతరులపై బురద జల్లడం ఆయన నైతికతను మరింత దిగజార్చుతోంది.

ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు నడిపించే అపర చాణక్యుడు అమిత్ షా ముందు ప్రవీణ్ కుమార్ ఒక చిన్న పావు మాత్రమే. 

రేపు కేంద్రంలో ఎంపీ సీట్ల కోసం లేదా కేసుల ఉపశమనం కోసం దిల్లీ పెద్దల ఆదేశాల మేరకు తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీల మధ్య ఏదైనా లోపాయికారీ అవగాహన కుదిరితే.. మొదట బలి అయ్యేది ప్రవీణ్ కుమార్‌ యే.

అప్పుడు "అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు" అని బీఆర్ఎస్ చాలా ఈజీగా చేతులు దులుపుకుంటుంది. 

అటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి ఫైర్‌బ్రాండ్స్ లీగల్‌గా ఈయన్ను ఇరకాటంలో పెడతారు. మరోవైపు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఢీకొట్టడం కూడా ప్రవీణ్ కుమార్‌కు సాధ్యం కాదు. 

కాంగ్రెస్ లోని తలలు పండిన సీనియర్లు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యే వరకు వ్యూహాత్మకంగా ఎలాగైతే వేచి చూస్తున్నారో, అలాగే బీఆర్ఎస్ పెద్దలు కూడా ప్రవీణ్ కుమార్‌ను వాడుకుని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

పదవీ వ్యామోహం, రాజకీయ అత్యాశ మనుషుల వివేకాన్ని ఎలా దెబ్బతీస్తాయో చెప్పడానికి ప్రవీణ్ కుమార్ ప్రస్తుత పరిస్థితే ఒక ఉదాహరణ. ఇటు నమ్ముకున్న బీఆర్ఎస్ లో ఆయనకు శాశ్వత స్థానం ఉండదు, 

అటు తాకట్టు పెట్టిన బహుజన సమాజం ఆయనను మళ్లీ నమ్మదు. చివరకు రాజకీయంగా చెల్లాచెదురై, ఒక 'పొలిటికల్ అనాథ'గా మిగిలిపోయే ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ ఉన్నారనేది క్షేత్రస్థాయి నిష్ఠుర సత్యం.

Sidhumaroju✍️

Search
Categories
Read More
Andhra Pradesh
బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా...
By Ratna Sekhar 2026-02-28 19:12:00 0 2K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : అగ్నిప్రమాదంలో రూ. 50 వేల మేర నష్టం
పుంగనూరు మండలం భీమగానిపల్లి సమీపంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన...
By Kothuru Murali 2026-02-20 09:25:05 0 190
SURAKSHA
N. Ashok Kumar, IAS: Leading Mizoram with Vision
The Journey Begins "The true measure of governance is not the policies announced,...
By Fathima Safa 2026-07-21 11:39:43 0 149
Haryana
Haryana Strengthens Law and Order Across the State
Haryana continues to enhance its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 05:19:26 0 75
Andhra Pradesh
మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి...
By Pagadala Venkateswar 2026-03-05 03:46:12 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com