శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
142

 

శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.

Andhra

Chandrababu appreciates Nara Lokesh

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్

లోకేశ్‌ను అభినందించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు

సీనియర్లు, జూనియర్ల కలయికతో నూతన కమిటీల కూర్పు

ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు, క్రమశిక్షణతో మెలగాలని నేతలకు సూచన

రాష్ట్ర పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామని వెల్లడి

తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం నింపుతూ, భవిష్యత్ కార్యాచరణకు స్పష్టమైన సంకేతాలిస్తూ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. "శభాష్ లోకేశ్" అంటూ ఆయన పనితీరును కొనియాడారు. కేవలం పర్మిషన్లతో కాదని, పనితోనే పదవులు వస్తాయని నిరూపించారని ప్రశంసించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు... పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ లోకేశ్ ప్రతిభ, పట్టుదలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేశ్ అత్యంత కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలను నిరంతరం చైతన్యవంతం చేశారు. అధికారంలోకి వచ్చాక పార్టీని మరింత ముందుకు నడిపిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమం నుంచి శిక్షణా తరగతుల వరకు అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయంటే దానికి లోకేశ్ కృషే కారణం. ఆయన సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్ అనే అత్యున్నత బాధ్యతను అప్పగించాం. ఇది పదవి కాదు, బాధ్యత" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

నూతన కమిటీ కూర్పుపై చంద్రబాబు వ్యాఖ్యలు

కొత్త కార్యవర్గ కూర్పుపై మాట్లాడుతూ, ఎన్నో సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. "సీనియార్టీ, సిన్సియార్టీ, సోషల్ రీ-ఇంజనీరింగ్ ఆధారంగా ఈ కమిటీలను ఏర్పాటు చేశాం. సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే, యువతకు, కొత్తవారికి అవకాశాలు కల్పించాం. కష్టపడి పనిచేసిన వారికే పట్టం కట్టాం. పార్టీ చరిత్రలో తొలిసారిగా ఒక మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌చార్జికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించి 'కార్యకర్తే అధినేత' అనే నినాదాన్ని నిజం చేశాం. మహిళలకు పెద్దపీట వేశాం" అని వివరించారు.

 

మనం సరిగ్గా పనిచేసిన దానికి నిదర్శనం అదే

మరో మూడేళ్లలో ఎన్నికలు వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చంద్రబాబు నేతలకు, కార్యకర్తలకు సూచించారు. "2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ప్రతి బూత్‌లో కూటమికి ఎక్కువ ఓట్లు రావాలి. అదే మనం సరిగ్గా పనిచేసిన దానికి నిదర్శనం. మనం చేసిన అభివృద్ధి, తెచ్చిన మార్పు, పడిన కష్టాన్ని ప్రజలకు వివరించాలి. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉంటే, కేంద్రం సహకారంతో దాన్ని గాడిన పెడుతున్నాం. సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ, సంక్షేమాన్ని అందిస్తున్నాం. పోలవరం, అమరావతి పనులు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రాష్ట్రానికి పోయిన బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి తీసుకొస్తున్నాం" అని తెలిపారు.

 

దేశానికి స్వాతంత్ర్యం కూడా తామే తెచ్చామని చెబుతారు

ప్రతిపక్షంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "గొడ్డలి పార్టీకి 'సీసీడీ' (క్రెడిట్ చోరీ డిజార్డర్) అనే మానసిక వ్యాధి సోకింది. వీరిని ఇలాగే వదిలేస్తే, దేశానికి స్వాతంత్ర్యం కూడా తామే తెచ్చామని చెబుతారు. మనం చేసే మంచి పనులను అడ్డుకోవడమే వారి పని. సొంత బాబాయిని హత్య చేసి నెపం మనపై నెట్టారు. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలతో పోరాడాను, కానీ తొలిసారిగా నేరస్తులతో పోరాడుతున్నాం. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలి," అని పిలుపునిచ్చారు.

 

అహం వీడి, క్రమశిక్షణతో మెలగాలి

అధికారం వచ్చిందన్న అహం ప్రదర్శించవద్దని, బేషజాలకు పోవద్దని చంద్రబాబు నేతలకు హితవు పలికారు. "ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. ఫ్లెక్సీలు, కుర్చీల కోసం గొడవలు పడవద్దు. పవన్ కల్యాణ్ తో నేను బాగానే ఉన్నాను. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీలతో కలిసికట్టుగా పనిచేయాలి. ప్రజలతో సౌమ్యంగా ఉంటూ, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలి. తప్పు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా కాకుండా, మళ్లీ మళ్లీ గెలిచేలా ప్రజాసేవ చేయాలి" అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Odisha
Subhadra Yojana: ₹5,106 Crore Empowering Odisha Women
In a landmark move for women's empowerment, the Odisha government successfully deposited a...
By Lokeshwari Panthadi 2026-07-02 07:26:29 0 112
SURAKSHA
Empowering Safety: Puducherry Police’s Dedicated Support
The Puducherry Police are deeply committed to safeguarding the welfare of women and children...
By Lokeshwari Panthadi 2026-07-03 08:24:09 0 249
Puducherry
Puducherry Boost: JIPMER Cancer Centre & University Upgrades
Puducherry is undergoing significant infrastructure revitalization with major development...
By Lokeshwari Panthadi 2026-06-29 04:54:55 0 155
Telangana
మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి
మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి ఈనెల 14న మందమర్రి ఏరియాలో అంబేద్కర్ 135వ జయంతి...
By Pinnehasan Odela 2026-04-09 14:35:06 0 248
BMA
MIB 2026 Rules: Examining Media Cross-Ownership Limits
The newly drafted Telecommunications (Television, Radio and Associated Services) Rules 2026...
By JoinBMA 2026-09-11 06:45:08 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com