Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.

0
350

ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత

కమిటీ విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం

సిట్, కమిటీ దర్యాప్తులు వేర్వేరని, ఒకదానిపై ఒకటి ప్రభావం చూపవని వెల్లడి

రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్‌కుమార్‌ కమిటీ నివేదికకు మార్గం సుగమం

 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలకు సంబంధించిన వివాదంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ విచారణను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కమిషన్ నియామకాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇవాళ‌ కీలక తీర్పు వెలువరించింది.

 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. తిరుమల నెయ్యి వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ దర్యాప్తు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా మరో కమిటీని ఎలా ఏర్పాటు చేస్తుందని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీఎం చంద్రబాబు, టీటీడీ, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు.

 

స్వామి వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఒక దర్యాప్తు సంస్థ విచారణ మరో కమిటీపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. "రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ పరిపాలనాపరమైన లోపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేయబడింది. ఇది సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తుందని మేము భావించడం లేదు. చట్ట ప్రకారం సిట్, ఏకసభ్య కమిటీ తమ తమ విధులను నిర్వర్తించవచ్చు" అని ధర్మాసనం పేర్కొంది. ఈ రెండు విచారణలు వేర్వేరని, ఒకదాని పరిధిలోకి మరొకటి రాదని (ఓవర్‌లాపింగ్ కాదని) తేల్చి చెప్పింది.

 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలు టెండర్లు, నిబంధనల సడలింపులో లోపాలు జరిగాయని సీబీఐ సిట్ తన నివేదికలో ప్రభుత్వానికి వెల్లడించింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఈ సిట్ నివేదిక ఆధారంగా ఎవరిపై, ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది.

 

తాజాగా సుప్రీంకోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దినేశ్‌కుమార్ కమిటీ తన విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!
చింతూరు వారపు సంత మార్కెట్ జరిగే ప్రదేశం లో గుర్తు తెలియని సుమారు 60సంవత్సరాల పైచిలుకు వ్యక్తి...
By Shyamala Yadagiri 2026-07-25 08:22:11 0 172
Andhra Pradesh
ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో...
By Boiena Rajesh 2026-04-01 23:51:49 0 238
Telangana
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల...
By Sidhu Maroju 2025-11-08 06:45:20 0 313
Andhra Pradesh
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: జాతీయ కార్మిక సమ్మెకు ఆశా వర్కర్స్ పిలుపు
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని మరియంపేట పీహెచ్సీ వద్ద ఫిబ్రవరి 12న...
By Gadiyapudi Narendra 2026-02-09 19:32:38 0 215
Andhra Pradesh
ఆర్థిక సర్వేలో ఏపీ ప్రస్తావన ఏముందంటే.
AP: ఏపీలో ద్రవోల్బణం 2022-23లో 7.57 శాతం ఉంటే.. 2025-26 నాటికి 1.39 శాతానికి తగ్గిందని ఆర్థిక...
By Pagadala Venkateswar 2026-01-29 11:57:32 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com