మంచిర్యాల: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లు AITUC కార్మిక సంఘంలో చేరారు. ఈ సందర్భంగా AITUC నాయకులు వారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే, వారికి ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు సమయానికి వేతనాలు అందకపోవడం, తక్కువ వేతనాలు, అధిక పని ఒత్తిడి వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఔట్సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ESI, PF సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల ప్రకారం కార్మికులకు దక్కాల్సిన అన్ని హక్కులు, సౌకర్యాలను అమలు చేయాలని కోరారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం AITUC నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొంటూ, కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో RTC ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ అధ్యక్షులు మామిడిపల్లి శ్రీనివాస్, డిపో కార్యదర్శి గోలి శంకర్, శంకరాచారి, అంజయ్య, సర్వర్ పాషా, రాజు, భారతి, సుమలత, పానుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.