Bharat Aawaz

కొత్తగూడెం ఐడీఓసీలో ఎసీబీ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు.

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
127
Views

భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీలో ఎసీబీ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులతో అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.

 

విజిలెన్స్ అవగాహన వారోత్సవం 2026లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం IDOCలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి DM & HO, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు అవినీతి నిరోధక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

2026 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహిస్తున్న ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ఇతివృత్తం "సమృద్ధి కోసం సత్యనిష్ఠ - Probity for Prosperity". ఈ సందర్భంగా అవినీతి నిర్మూలన, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం మరియు నైతిక విలువల ప్రాధాన్యంపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ విధుల నిర్వహణలో సత్యనిష్ఠను పాటిస్తూ, అవినీతికి తావులేకుండా ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో ACB ఖమ్మం రేంజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై. రమేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. శేఖర్ మరియు సిబ్బంది పాల్గొని అవినీతి నిర్మూలన, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, నిజాయితీతో కూడిన పరిపాలన, ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. మరియు ఉద్యోగులచే అవినీతి రహిత సమాజం కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ సేవలను నిష్పక్షపాతంగా, లంచాలకు తావులేకుండా అందించాలని సూచించారు.

 

ప్రభుత్వ అధికారి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ACBకి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ఉద్యోగులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.