Bharat Aawaz

నమ్మకమే తాళం చెవి.. రూ.2 కోట్ల సొత్తుపై కన్ను.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
5 min read
0
Comments
201
Views

 

● సొంత ఇంటి నిర్మాణం కోసం చోరీకి పథకం.. కార్పెంటర్ అరెస్ట్

● 1.180 కిలోల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు స్వాధీనం

అల్వాల్, అక్టోబర్ 27: ఇంటి యజమాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని డూప్లికేట్ తాళం చెవితో చోరీకి పాల్పడిన కార్పెంటర్‌ను మారేడుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 1.180 కిలోల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని మల్కాజిగిరి జోన్ డీసీపీ చల్లా శ్రీధర్ వెల్లడించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ పర్యవేక్షణలో కేసును ఛేదించినట్లు వివరించారు.

బోడుప్పల్‌లోని రాఘవేంద్ర కాలనీకి చెందిన వెల్శాల భరత్ (38) వృత్తిరీత్యా కార్పెంటర్. పశ్చిమ మారేడుపల్లి నెహ్రూ నగర్‌లోని వెంకట్ సాయి రెసిడెన్సీలో నివసించే డాక్టర్ ఆచి మోహన్ ఇంట్లో గతంలో కార్పెంటర్ పనులు, మరమ్మతులు చేశాడు. ఆ పరిచయంతో ఇంటి తాళం చెవి ఆధారంగా డూప్లికేట్ తాళం చెవిని తయారు చేసుకున్నాడు.

ఈ నెల 19న బాధిత కుటుంబం ఖమ్మం జిల్లా ఎల్లందికి వెళ్లి అక్టోబర్ 20న తిరిగి వచ్చింది. ఇంట్లోని బెడ్‌రూమ్ తాళం దెబ్బతిని ఉండటంతో పాటు బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు కనిపించకపోవడాన్ని గుర్తించింది. ఈ ఘటనపై అక్టోబర్ 22న మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

డీసీపీ పర్యవేక్షణలో బేగంపేట డివిజన్ ఏసీపీ, మారేడుపల్లి ఎస్‌హెచ్‌ఓ, డీఐ, క్రైమ్ టీమ్ దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితులు, ఇతర సాక్షులను విచారించడంతో పాటు ఘటనాస్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ సహకారంతో భౌతిక, వేలిముద్రల ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, గతంలో బాధిత కుటుంబానికి పరిచయమున్న భరత్‌పై అనుమానం ఏర్పడింది. దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు అక్టోబర్ 27న అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం పంచనామా నిర్వహించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

సొంత ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు రుణం తీసుకోకుండా, చోరీ ద్వారా డబ్బు సమకూర్చుకుని నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో నిందితుడు ఈ నేరానికి పాల్పడినట్లు డీసీపీ వివరించారు.

కేసు ఛేదనలో సమన్వయంతో పనిచేసిన బేగంపేట డివిజన్ ఏసీపీ పి. గోపాలకృష్ణమూర్తి, మారేడుపల్లి ఎస్‌హెచ్‌ఓ వీరబాబు, డీఐ శ్రీశైలం నాయక్ , క్రైమ్ టీమ్, ఇతర పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు.

ఇళ్లకు పటిష్టమైన తాళాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన బంగారు ఆభరణాలు, నగదును సురక్షితంగా భద్రపరచుకోవాలని పోలీసులు సూచించారు. ఇంట్లో పనులు చేసే వారి గుర్తింపు వివరాలను నిర్ధారించుకోవడంతో పాటు, ప్రయాణ వివరాలను సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా వెల్లడించవద్దని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సహాయం కోసం డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.

#Sidhumaroju

Alwal