భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.

0
132

 

భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు

09-04-2026 Thu 20:15 | Andhra

Chandrababu Naidu Land Records Can No Longer Be Tampered With

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత ముగింపు పలికే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, 2027 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో గురువారం జరిగిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పాస్‌పుస్తకాలను అందజేసి, వారి సమక్షంలోనే భూ వివరాలను అధికారులతో చదివి వినిపించారు. అవినీతికి ఆస్కారం లేకుండా, ఆటో మ్యుటేషన్ తర్వాత పాస్‌బుక్‌ను నేరుగా యజమాని ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించారు.

 

భూ రికార్డులకు పటిష్ఠ భద్రత

 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది ప్రజల భద్రత, జీవనాధారమని అన్నారు. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు 'రీ సర్వే 2.0' చేపట్టామని, 2027 మార్చి నాటికి రాష్ట్రంలోని 16,816 గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. 

 

కొత్త పాస్‌పుస్తకాలకు కరెన్సీకి వాడే టెక్నాలజీనే వినియోగిస్తున్నామని, దీనివల్ల భవిష్యత్తులో ఎవరూ రికార్డులను తారుమారు చేయలేరని భరోసా ఇచ్చారు. "రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చాం. భూ యజమానులు తమ ఆధార్, ఈ-కేవైసీ ద్వారా భూ రికార్డులను లాక్ చేసుకునేందుకు 'రికార్డుల లాకర్ సిస్టమ్'ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ప్రజల ఆస్తులకు రక్షణ కవచంగా ఉంటుంది. ప్రజల భూములకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే వివాదాస్పద ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం" అని ముఖ్యమంత్రి వివరించారు.

 

22ఏ జాబితా ప్రక్షాళన, కీలక నిర్ణయాలు

 

భూ యజమానులకు మేలు చేసే పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. 2016కు ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌లో పట్టా పొందిన సుమారు 75 లక్షల పేద కుటుంబాలకు రిజిస్ట్రేషన్ సౌలభ్యం కల్పిస్తున్నామని, దీనివల్ల వారు తమ ఆస్తులను అమ్ముకునేందుకు, గిఫ్ట్‌గా ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు. 

 

గత ప్రభుత్వం 14 లక్షల ఎకరాల పట్టా భూములను అక్రమంగా 22ఏలో చేర్చిందని, ఆ జాబితాను పూర్తిగా సంస్కరిస్తున్నామని అన్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి 22ఏపై కలెక్టర్ అధికారాలను జేసీ, ఆర్డీవోలకు బదలాయిస్తున్నట్లు ప్రకటించారు. వెబ్‌ల్యాండ్ తప్పులను సుమోటోగా సరిదిద్దే అధికారాన్ని ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఇస్తామని చెప్పారు.

 

ఆటో-మ్యూటేషన్‌తో ఇంటికే పాస్‌బుక్

 

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సంస్కరణలు తెస్తున్నామని సీఎం తెలిపారు. "జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 9 లక్షల భూ లావాదేవీలకు ఆటో-మ్యూటేషన్ పూర్తి చేశాం. అమ్మకాలు, బహుమతులు, విభజన పత్రాల్లో 100 శాతం ఆటో-మ్యూటేషన్ తీసుకొచ్చాం. ఇకపై పాస్‌బుక్ కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆస్తి రిజిస్ట్రేషన్ కాగానే, ప్రింట్ చేసిన పాస్‌బుక్‌ను నేరుగా యజమాని ఇంటికి పంపాలి" అని అధికారులను ఆదేశించారు. 

 

వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా సులభతరం చేశామని, స్లాట్ బుకింగ్ విధానంతో గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా చేశామని పేర్కొన్నారు.

 

కన్నతల్లిని కోర్టుకీడ్చిన వ్యక్తి ప్రజలకు ఆదర్శం కాదు

 

గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "గత ప్రభుత్వంలో ప్రజల భూములపై కన్నేసి కబ్జాలు చేశారు. రికార్డులు తారుమారు చేసి ప్రతీ గ్రామంలో భూ వివాదాలు సృష్టించారు. అధికారం ఉందని పట్టాదారు పాస్‌పుస్తకాలపై, సరిహద్దు రాళ్లపై కూడా తమ బొమ్మలు వేసుకుని వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. వారు అధికారం నుంచి దిగిపోయినా వారి పాపాలు, అక్రమాలు ఇంకా వెంటాడుతున్నాయి. అంతలా రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారు. కన్నతల్లిని కోర్టుకీడ్చిన వ్యక్తి ప్రజలకు ఆదర్శం కాదు" అని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 

కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, కక్షలకు దూరంగా గౌరవంగా బతకాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
*వెల్లుల్లి - మీ వంటగదిలో ఉన్న అద్భుత క్యాన్సర్ నిరోధి*!
మీకు 45 ఏళ్లు దాటుతున్నా... ఈ విషయం మీ కోసమే!   .   ప్రపంచ మరణాలకు ప్రధాన...
By Nagula Swamy 2026-03-11 01:31:59 0 575
Telangana
మిస్టరీ డెత్ ... హత్య ? ఆత్మహత్య ?
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం...
By Nookapangu Manikanta 2026-05-15 16:53:36 0 328
Telangana
అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల
గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్...
By Ponnala Srinivasrao 2026-03-16 10:09:22 0 275
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_ఇంధన కొరత_*   *_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు...
By Rajini Kumari 2026-03-24 11:56:53 0 222
BMA
SC Warns Against Using Criminal Laws to Gag Indian Press
In its 2025 jurisprudence, the Supreme Court strongly cautioned against the chilling effect of...
By JoinBMA 2026-08-20 05:24:32 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com