ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి 170 కోట్లు

0
209

పత్రికా ప్రకటన

విజయవాడ, తేదీ: 08.04.2026

 

*ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి రూ.170 కోట్లతో భారీ ప్రణాళిక*

 

*----- ఖేలో ఇండియా నిధులతో స్టేడియం అభివృద్ధి పనులకు ఎంపీ కేశినేని చిన్ని, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*

 

 *విజయవాడ :* 

రాబోయే మూడు సంవత్సరాలలో ప్రతి నగరం, పట్టణం, గ్రామాల్లో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా నిధులు రూ.19 కోట్ల వ్యయంతో విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ (ఐజీఎంసీ) స్టేడియం లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా, నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ ఎండీ భరణి తదితరులతో కలసి శంకుస్థాపన చేశారు. 

 

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... పార్లమెంట్ ఉభయసభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించిన శుభ సందర్భంలో ఈ కార్యక్రమం జరగడం విశేషమన్నారు. విజయవాడ నగరానికి ఎంతో భావోద్వేగ అనుబంధం కలిగిన ఐ జి ఎం సి స్టేడియం అభివృద్ధిని గత ప్రభుత్వం ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు మరలా ప్రాధాన్యత పెరిగిందని, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వసతుల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అదే రీతిలో విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియం అభివృద్ధికి మొత్తం సుమారు రూ. 160 నుండి రూ. 170 కోట్ల వరకు మూడు దశల్లో వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఖేలో ఇండియా ద్వారా రూ.20 కోట్లు, శాప్ ద్వారా రూ. 20 కోట్లు, మిగిలిన నిధులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరనున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వ ఐదేళ్లలో ఆగిపోయిన క్రీడా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు వేగం పుంజుకున్నాయని, గుంటూరులో ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని, త్వరలో శ్రీకాకుళంలో కూడా పనులు ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి రూ.1000 కోట్ల నిధుల ప్రతిపాదనలు ఉన్నాయని, రెండో విడతలో రూ.100 కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని మంత్రి కొనియాడారు.

 

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) నేతృత్వంలో శాప్, నగర పాలక సంస్థ సమన్వయంతో స్టేడియం అభివృద్ధి జరుగుతుండటం అభినందనీయమన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. క్రీడల అబివృద్ధి కోసం ఎంపీ కేశినేని చిన్ని అనేక దఫాలు కేంద్ర క్రీడల శాఖా మంత్రిని కలసి విన్నవించడం జరిగిందన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్ ) మ్యాచ్‌లను అమరావతిలో ప్రారంభించి కడపలో ముగించాలనే ప్రతిపాదనను స్వాగతిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.

 

పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ... విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, అమరావతి రాజధానిగా శాశ్వత గుర్తింపు రావడంతో నగరానికి మరింత అభివృద్ధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లో క్రీడా వసతులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. స్టేడియాన్ని సుమారు రూ.185 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2029 నాటికి విజయవాడ, అమరావతిలో నేషనల్ గేమ్స్ నిర్వహించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పార్లమెంటు సభ్యులు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో సమర్ధవంతమైన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ ఎండీ భరణి వంటి యంగ్ డైనమిక్ అధికారులు జిల్లా యంత్రాంగంలో ఉన్నారని, ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా అభివద్ధికి ఇంకా అడ్డంకులు ఉండవన్నారు. ఇటువంటి సమర్ధవంతమైన యంగ్ అధికారులు జిల్లాలో ఉన్నందుకు తామంతా ఎంతో గర్వంగా ఫీలవుతున్నామని ఎంపీ శివనాథ్ తెలిపారు.  

 

శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ... స్టేడియం అభివృద్ధిలో ఎంపీ కేశినేని శివనాథ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. స్టేడియం అభివృద్ధి కోసం పలుమార్లు సందర్శించి మార్గనిర్దేశం చేశారని చెప్పారు. ఎంపీ సూచనల మేరకు స్టేడియంలో ఒక బ్లాక్‌కు ప్రముఖ మహిళా క్రీడాకారిణి పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి స్టేడియం పూర్తిగా రూపురేఖలు మారిపోతాయని, అంతర్జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

 

 రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు, క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు రాష్ట్రంలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని ఘనంగా గజమాలతో సత్కరించారు. 

 

ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డా. జీ. లక్ష్మీశ, నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ ఎం. ధ్యానచంద్ర,, శాప్ వీసీ అండ్ ఎండీ ఎస్. భరణి, అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, మార్కోలైన్స్ పేవ్‌మెంట్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ డైరెక్టర్ వెల్లంకి రేవంత్, కృష్ణాజిల్లా గ్రంధాలయ పరిషత్తు ఛైర్మన్ ఎంఎస్ బేగ్, శాప్ డైరెక్టర్లు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కోచులుగా పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ
విజయవాడ నగరపాలక సంస్థ  12-01-2026      *నిరుద్యోగులకు నగరపాలక సంస్థ...
By Rajini Kumari 2026-01-12 14:06:32 0 400
Andhra Pradesh
రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో...
By Pagadala Venkateswar 2026-04-10 06:02:53 0 139
Goa
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement Artificial Intelligence (AI) is no...
By BMA ADMIN 2025-05-21 09:27:54 0 2K
Haryana
Haryana Strengthens Law and Order Across the State
Haryana continues to enhance its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 05:19:26 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com