Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.

0
235

Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్

16-03-2026 Mon 15:35 | Andhra

 

Nara Lokesh Fulfills Promise Statue of Sacrifice Unveiled

షార్ట్స్‌లో చూడండి

అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తానని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజారాజధాని అమరావతిలో తన హామీకి ప్రతిరూపంగా నిలిచిన 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ తనకెంతో ఆనందాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన సాగించిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతీకగా 58 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరిగిన ఈ విగ్రహావిష్కరణ మహోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి త్యాగశిల్పం వద్ద ఆయన పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "ఒక మనిషి త్యాగం ఒక జాతికి గౌరవంగా నిలిచింది. ఒక దీక్ష ఒక రాష్ట్రాన్ని ఇచ్చింది. పొట్టి శ్రీరాములు గారు మరణం లేని మహనీయుడు, త్యాగానికి మానవరూపం. ఆయన 125వ జయంతి రోజున 58 అడుగుల విగ్రహం రూపంలో మనకోసం మళ్లీ జన్మించారు. ఈ విగ్రహానికి ఏం పేరు పెట్టాలని డూండి రాకేష్ అడిగినప్పుడు, ఆయన త్యాగం గుర్తుకురావాలనే ఉద్దేశంతో 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' అని సూచించాను. ఈ విగ్రహం తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతుంది" అని వివరించారు.

 

యువగళం హామీని నిలబెట్టుకున్నా

తాను తెలుగువాడినని, ఆంధ్రప్రదేశ్ పౌరుడినని గర్వంగా చెప్పుకుంటున్నానని, ఆ గౌరవాన్ని మనందరికీ ఇచ్చింది పొట్టి శ్రీరాములు అని లోకేశ్ అన్నారు. "యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్య సోదరులను అనేకసార్లు కలిసి వారి సమస్యలు చర్చించాను. వారికిచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే అమరావతిలో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాను. ఇచ్చిన హామీని ఇంత తక్కువ సమయంలో నిలబెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విగ్రహంలోని 58 అడుగులు, ఆయన చేసిన 58 రోజుల దీక్షకు సంకేతం. మనం ఒక్కరోజు ఉపవాసం ఉండటానికే ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక రాష్ట్రం కోసం ఆయన 58 రోజులు దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఈ చరిత్రను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత" అని లోకేశ్ ఉద్ఘాటించారు. కేవలం 194 రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వాన్ని, ట్రస్ట్ సభ్యులను, అధికారులను ఆయన అభినందించారు.

 

నిత్య పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు

పొట్టి శ్రీరాములు జీవితాన్ని స్మరించుకుంటూ, ఆయన నిత్య పోరాటయోధుడని లోకేశ్ కొనియాడారు. "ఆయన స్వార్థం లేని ఉద్యమాలు చేశారు. గాంధీజీతో కలిసి సబర్మతి ఆశ్రమంలో పనిచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లారు. నెల్లూరులో దళితుల ఆలయ ప్రవేశం కోసం, అంటరానితనంపై పోరాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడకపోవడం మహాపాపం అని ప్రకటించి, 'వస్తే రాష్ట్రం, పోతే ప్రాణం' అని నిశ్చయించుకున్నారు. దీక్షకు ఎవరూ స్థలం ఇవ్వకపోతే రోడ్డు మీదే చేస్తానన్న ఆయన స్ఫూర్తి నా యువగళం పాదయాత్రకు ప్రేరణగా నిలిచింది" అని లోకేశ్ గుర్తుచేసుకున్నారు.

 

1952 అక్టోబర్ 19న మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు 53.9 కిలోల బరువున్న పొట్టి శ్రీరాములు, 58వ రోజుకు 38.1 కిలోలకు పడిపోయారని, అయినా వెనకడుగు వేయకుండా ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని లోకేశ్ వివరించారు. ఆయన ప్రాణత్యాగం కోట్ల మందిని కదిలించి, ఢిల్లీని దిగివచ్చేలా చేసిందని, ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.

 

భారతదేశ చిత్రపటాన్ని మార్చిన మహనీయుడు

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాసాన్ని ఉటంకిస్తూ, "పొట్టి శ్రీరాములు గారి దీక్ష తర్వాతే భారతదేశ చిత్రపటంపై భాషా ప్రయుక్త రాష్ట్రాల రేఖలు ఏర్పడ్డాయని గుహ అన్నారు. అందుకే ఆయనను 'భారతదేశ మెర్కాటర్'గా అభివర్ణించారు. 16వ శతాబ్దంలో ప్రపంచ పటాన్ని రూపొందించిన భౌగోళిక శాస్త్రవేత్త మెర్కాటర్. అంతటి గొప్ప వ్యక్తి చరిత్రను దేశం గుర్తుంచుకునేలా ఈ విగ్రహం దోహదపడుతుంది" అని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి రోశయ్యను స్మరించుకున్న లోకేశ్, ఆయన రాజకీయాలకు అతీతంగా పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

 

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కోరిక మేరకు పొట్టి శ్రీరాములు పేరు మీద స్మారక నాణెం విడుదల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని లోకేష్ వెల్లడించారు. రాబోయే 12 నెలల్లో స్మృతివనం, ఫొటో గ్యాలరీ, మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్. సవిత, టీజీ భరత్, పి. నారాయణ, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు, అధికారులు, పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
TN Police Striking Hard Against Gambling
To eradicate social evils, the police conducted surprise raids on gambling dens across the state...
By Kalaga Sailaja 2026-06-27 11:12:48 0 298
Telangana
రాజకీయాల్లో లేని బండి సంజయ్ కొడుకు మీద పడి ఏడ్వడం కరెక్ట్ కాదు..కవిత
ఒక మైనర్ అమ్మయి న్యాయం కోసం పోలిస్టేషన్స్ చుట్టూ తిరుగుతుంది ఆ అమ్మాయి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్...
By Ponnala Srinivasrao 2026-05-13 23:48:16 1 808
Andhra Pradesh
కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం
విజయవాడ నగరపాలక సంస్థ  08-05-2026     *కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం*...
By Rajini Kumari 2026-05-08 13:46:09 0 152
Andhra Pradesh
కొడుకు కోసం తండ్రి విన తులు
కుమారుని ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు వివరాలకు వెళ్ళే ముందు విశాఖపట్నం...
By Mobbu Venkatramana 2026-01-30 18:29:25 0 533
Andhra Pradesh
అంతర్జాతీయ జానపద గాయకులు శ్రీ దామోదర గణపతి రావు గారు
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ , బ్రహ్మయ్య కాలనీ , రామ రాజ్య నగర్ , కబేళ సెంటర్ ,...
By Rajini Kumari 2026-02-02 17:15:16 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com