54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు

0
259

*పత్రికా ప్రకటన*

*విజయవాడ, తేదీ: 04.01.2026* 

 

*• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం – క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా శాప్ కార్యాచరణ*

*• సమగ్ర క్రీడా పాలసీతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి చేస్తున్నాం*

*• ₹54 కోట్ల తో క్రీడా మౌలిక వసతుల ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి*

*• తిరుపతిలో క్రీడల అభివృద్ధికి 28.30 ఎకరాల భూకేటాయింపులు*

*• క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% హారిజాంటల్ రిజర్వేషన్*

*• 2026 జనవరి 15 లోపు క్రీడా యాప్‌లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి*

 

*— శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు* 

 

క్రీడాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, 2026 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ను క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAP) చైర్మన్ అనిమిని రవి నాయుడు స్పష్టం చేశారు.

 

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడలను ఉద్యమంగా మార్చి, ప్రతి జిల్లాలో మౌలిక వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాప్ ఛైర్మన్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో క్రీడాకారులకు రావాల్సిన బకాయిలుగా సుమారు రూ.16 కోట్లను ఇప్పటికే విడుదల చేసినట్లు, అలాగే ఫిబ్రవరి నెలలో మరో రూ.8 కోట్లను క్రీడాకారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ సుధీర్ఘ క్రీడా అభివృద్ధి ప్రయాణంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని శ్రీ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్ర క్రీడా శాఖకు, ముఖ్యంగా క్రీడాకారుల సంక్షేమం మరియు క్రీడా రంగ అభివృద్ధికి నిరంతర సహకారం అందించిన మీడియా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 2026 సంవత్సరంలో కూడా ఇదే విధంగా మీడియా మద్దతు కొనసాగాలని ఆకాంక్షించారు. 

గతంలో రాష్ట్రంలో క్రీడా విభాగానికి స్పష్టమైన క్రీడా విధానం లేకుండా, సరైన మౌలిక వసతులు లేక నిద్రాణావస్థలో కొనసాగిందని తెలిపారు. తాను ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీ లేకపోవడంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పాలసీ రూపకల్పనలో మీడియా ప్రతినిధులు, క్రీడా సంఘాలు, ప్లేయర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని, అవసరమైన మార్పులు, సవరణలు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు.

 

ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏసియన్ గేమ్స్‌లను లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్రంలోనూ అనుసరించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ దిశగా క్రీడల్లో ముందున్న తమిళనాడు సహా దాదాపు 17 రాష్ట్రాల క్రీడా విధానాలు, పనితీరును అధ్యయనం చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి కోసం సుమారు రూ.54 కోట్ల విలువైన ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి చేసి, అన్ని ప్రాంతాల్లో పారదర్శకంగా పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

 

శాశ్వత క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి భాగంగా శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, విశాఖపట్నం కొమ్మాదిలో సుమారు రూ.25 కోట్లతో ఆధునిక స్టేడియం నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. విజయనగరంలో ఈ ఏడాదే స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే అరకు–పాడేరు ప్రాంతాల్లో క్రీడల్లో ప్రతిభ ఉన్న గిరిజన పిల్లల కోసం ఎస్టీ కంపోనెంట్ నిధులు, స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

 

కాకినాడలో ఖేలో ఇండియా పథకం కింద సింథటిక్ ట్రాక్ పూర్తి చేసి, అక్కడే క్రీడా అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాటర్ గేమ్స్ తో పాటు మల్టీ పర్పస్ స్పోర్ట్స్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రాజమండ్రిలో అమరావతి పుష్కరాల పేరుతో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ఇప్పటికే ప్రారంభమైందని, అలాగే ఏలూరులో వెయిట్‌లిఫ్టింగ్ తదితర క్రీడలకు అనుకూలంగా సుమారు రూ.8 నుండి రూ.10 కోట్లతో మరమ్మత్తుల పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

 

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కీలక క్రీడా మైదానాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ (ఐజీఎంసీ) స్టేడియంను ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు శాప్ చర్యలు చేపడుతోందని, గుంటూరులోని బీఆర్ స్టేడియంను కూడా రాష్ట్ర క్రీడా అభివృద్ధి లక్ష్యంగా సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ స్టేడియాలు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు కేంద్రాలుగా నిలవనున్నాయని పేర్కొన్నారు.

 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో క్రీడల అభివృద్ధి కోసం స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌కు 28.30 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ భూమిలో ఆధునిక క్రీడా మౌలిక వసతులు, అకాడమీల ఏర్పాటు ద్వారా తిరుపతిని రాష్ట్రంలోని ప్రధాన క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా క్రీడాకారుల భవిష్యత్తు భద్రత దృష్ట్యా, రానున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అర్హత గల క్రీడాకారులకు 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

కబడ్డీ అసోసియేషన్‌లో కొంతకాలంగా వివాదాస్పద పరిస్థితి నెలకొందని, ఒక మహిళ 28 మంది క్రీడాకారుల సర్టిఫికెట్లు నకిలీవని ఆరోపణలతో ఫిర్యాదు చేయగా, శాప్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి సర్టిఫికెట్లను పరిశీలించిందని చెప్పారు. కమిటీ విచారణలో కొందరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు నకిలీవని నిర్ధారణ కావడంతో, వారి మీద చట్టపరమైన చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

 

క్రీడాకారులకు క్రీడా ప్రోత్సాహకాలు సక్రమంగా అందించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రీడా యాప్‌లో సంబంధిత సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. క్రీడాకారులు శాప్ ద్వారా గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొనాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలు 2026 జనవరి 15వ తేదీలోపు క్రీడా యాప్‌లో తమకు సంబంధించిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని కోరారు.

 

 

*జారీ చేసినవారు: సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్*

Search
Categories
Read More
Andhra Pradesh
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు.
  అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-06-18 05:29:15 0 106
SURAKSHA
Women Safety: Nirbhaya Teams Active Patrol
Goa Police Nirbhaya Teams patrol buses, colleges, markets and beaches for women safety. Female...
By Kalaga Sailaja 2026-07-03 07:46:44 0 127
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 247
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: రాబోయే...
By Chunarkar Jagadeesh 2026-06-17 16:19:48 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com