హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సూచించారు. క్రీడా పోటీల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి అంశాన్ని పకడ్బందీగా పర్యవేక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణ ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని బేగంపేట టూరిస్ట్ ప్లాజాలో వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడాశాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలాదేవి, వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడాశాఖ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ.. ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి చేసిన కృషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవం కారణంగా ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు దక్కాయని పేర్కొన్నారు.డిప్యూటీ కలెక్టర్ల పనితీరును గుర్తించిన ముఖ్యమంత్రి వారికి ఈ క్రీడా పోటీల నిర్వహణ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ప్రతి అధికారి ఈ బాధ్యతను ఒక సవాల్‌గా స్వీకరించి అంకితభావంతో పనిచేయాలని, అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఖేలో ఇండియా నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. చేపట్టిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో పాటు నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించినా, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను చాటిచెప్పేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించాలని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని కేవలం క్రీడా పోటీలుగా కాకుండా రాష్ట్ర గౌరవానికి సంబంధించిన ప్రతిష్టాత్మక బాధ్యతగా భావించాలని శివసేన రెడ్డి పేర్కొన్నారు.ఖేలో ఇండియా నిర్వహణలో విధుల పట్ల నిర్లక్ష్యం, పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.