Bharat Aawaz

పలాసలో 6000 ఇళ్లు ఇచ్చాం.. ఫ్యాన్ గుర్తును గెలిపించండి: సీదిరి అప్పలరాజు

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
352
Views

కూటమి హామీలపై 7 ప్రశ్నలు.. ప్రభుత్వ భూముల అక్రమాలపై ఆరోపణలు

పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించారు.

కూటమి హామీలు ఏమయ్యాయి?ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు రూ.3000 భృతి, 50 ఏళ్లకే పెన్షన్ హామీల అమలుపై నిలదీశారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు ఎన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని విమర్శించారు.

మా హయాంలో అభివృద్ధి: 2019-2024 మధ్య తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన గుర్తు చేశారు. మూలపేట పోర్టు, కేటీ రోడ్డు విస్తరణ, 68 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్, 150 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ లేఅవుట్, రైల్వే ఫ్లైఓవర్ పనులు తమ హయాంలోనే ముందుకు సాగాయన్నారు.

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 6000కు పైగా ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. జగనన్న స్మార్ట్ లేఅవుట్ లో 2500, 982 టిడ్కో ఇళ్లు పూర్తి, టిడ్కో పక్కన 960 పట్టాలు, తర్లాకోట వద్ద 450 పట్టాలు, సొంత స్థలం ఉన్నవారికి 1000-1200 ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. పలాసను రెవెన్యూ డివిజన్ చేయడం, రూ.110 కోట్లతో AIB తాగునీటి ప్రాజెక్టు, రూ.700 కోట్ల ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనలు తమ హయాంలోనే చేశామన్నారు.

సంచలన ఆరోపణలు: ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కొండల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జగన్నాథసాగరం చెరువును కప్పే ప్రయత్నం, YSR ఆసుపత్రి వెనుక భూములు, సూదికొండ తవ్వకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కాంప్లెక్స్ పక్కన ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు అప్పగిస్తున్నారని స్థానికులు తన దృష్టికి తెచ్చారన్నారు.

మద్యం విక్రయాల్లో ప్రతి బాటిల్ పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారని, దీని ద్వారా నెలకు రూ.99 లక్షలు, ఏడాదికి రూ.12 కోట్లు వసూలు జరుగుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి: గతంలో తమకు అవకాశం ఇచ్చినప్పుడు అభివృద్ధి చేసి చూపించామని, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థితో పాటు 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.