Bharat Aawaz

ఆదివాసీల హక్కులను గౌరవించాలి. అడవుల సంరక్షణ అందరి బాధ్యత

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
6 min read
0
Comments
100
Views

• తుడుందెబ్బ ముఖ్య నాయకులతో ఆసిఫాబాద్ DFO శ్రీమతి బాలమణి ప్రత్యేక సమావేశం

• సౌహార్ద్ర వాతావరణంలో క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘ చర్చలు

• సాంప్రదాయాలకు అడ్డంకులు ఉండవు అటవీ అధికారిణి భరోసా 

🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుందెబ్బ' ముఖ్య నాయకులతో జిల్లా అటవీ అధికారిణి (DFO) శ్రీమతి బాలమణి గారి ప్రత్యేక సమావేశం ఎంతో స్నేహపూర్వక    వాతావరణంలో జరిగింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ నిబంధనలు, ఆదివాసీల హక్కులు, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు అడవుల సంరక్షణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఆదివాసీల హక్కులను గౌరవించాలని, అలాగే అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. 

• తుడుందెబ్బ నాయకుల కీలక డిమాండ్లు: సమావేశంలో తుడుందెబ్బ నాయకులు పలు కీలకమైన అంశాలను, క్షేత్రస్థాయి ఇబ్బందులను DFO దృష్టికి తీసుకువెళ్లారు.

• చట్టాల అమలు: ఏజెన్సీ ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు 1/70 చట్టం మరియు పెసా (PESA) చట్ట నిబంధనలను తప్పనిసరిగా గౌరవించి నడుచుకోవాలని కోరారు.

• అభివృద్ధి పనులకు ఆటంకం వద్దు: ఆదివాసీ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను నిబంధనల పేరిట అటవీ శాఖ అధికారులు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

• సాంప్రదాయాలకు గౌరవం: తరతరాలుగా ప్రకృతిని, అడవులను కాపాడుకుంటున్న ఆదివాసీలను నిబంధనల పేరిట వేధించవద్దని, వారి సంస్కృతి, సాంప్రదాయాలు, దేవుళ్ల పండుగల పూజా కార్యక్రమాలకు అవసరమైన కట్టెలు తెచ్చుకునే విషయంలో ఇబ్బందులకు గురిచేయకూడదని కోరారు.

• స్థానికులకే ప్రాధాన్యత: ఏజెన్సీ పరిధిలోని అటవీ శాఖ నియామకాలు, కాంట్రాక్టు పనుల్లో స్థానిక ఏజెన్సీ ఆదివాసీలకే పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

• అటవీ పరిరక్షణకు మద్దతు: ఆదివాసీ ప్రజలకు అన్యాయం జరగనంత కాలం అటవీ పరిరక్షణలో అటవీ శాఖ అధికారులకు తుడుందెబ్బ సంపూర్ణ సహకారం అందిస్తుందని, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అని నాయకులు స్పష్టం చేశారు.

• DFO సానుకూల స్పందన - భరోసా: తుడుందెబ్బ నాయకుల విజ్ఞప్తులపై DFO శ్రీమతి బాలమణి గారు సానుకూలంగా స్పందిస్తూ పలు హామీలు ఇచ్చారు. ఆదివాసీల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పండుగల విశిష్టత తమకు తెలుసని, దైవ కార్యక్రమాలకు అవసరమైన కట్టెలను వినియోగించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, అటవీ సంపదను స్వార్థ ప్రయోజనాలకు, వ్యాపార కార్యకలాపాలకు తరలించే వారిని ఎట్టి పరిస్థితి లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అటవీ సంపదను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. వెదురు బొంగులను శాస్త్రీయ పద్ధతిలో కత్తిరించడం వల్ల నాలుగు రెట్లు అధికంగా గింజలు, ఉత్పత్తులు పెరుగుతాయని, అయితే ఇదంతా నిర్దేశిత పరిమితి మేరకే జరగాలని పేర్కొన్నారు. పర్యావరణాన్ని, అడవులను కాపాడటంలో ఆదివాసీలు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

• తక్షణ న్యాయం కోసం చరవాణి నంబర్: క్షేత్రస్థాయిలో అటవీ సిబ్బంది వల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే తన చరవాణి (ఫోన్) ద్వారా సమాచారం అందించవచ్చని, వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేస్తామని DFO భరోసా ఇచ్చారు.

• సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ సమావేశంలో తుడుందెబ్బ జాతీయ అధ్యక్షులు కోట్నాక్  విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్, ముఖ్య సలహాదారు కనక ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ, ఉపాధ్యక్షులు కోట్నక రాంరావ్, వెడ్మ భగవంత్ రావ్, జిల్లా కార్యదర్శి సిడాం నాగోరావు, లింగాపూర్ మండల అధ్యక్షులు పెందోర్ ప్రకాష్, తిర్యాణి మండల విద్యార్థి సంఘం అధ్యక్షులు రాయ్ సిడాం జంగు, నాయకులు అడ సోమేష్, మడవి పురుషోత్తం, కోట్నాక వినేష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.