Bharat Aawaz

జవహర్ నగర్‌కు వ్యర్థాల తరలింపు నిలిపివేయాలి.. ఈటల డిమాండ్.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
6 min read
0
Comments
58
Views

● 27 నుంచి పాదయాత్ర.. కాలుష్యానికి శాశ్వత పరిష్కారం కోసం డిమాండ్

● ఒక్క కిలో వ్యర్థం కూడా రాకూడదు.. ఉన్న చెత్తను రీసైక్లింగ్ చేయాలి

అల్వాల్, అక్టోబర్ 25:జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించే లక్ష్యంతో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పోరుబాటకు సిద్ధమయ్యారు. ఆదివారం బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మేధావులు, పర్యావరణవేత్తలు, డంపింగ్ యార్డు బాధితులు హాజరయ్యారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈటల వివరించారు.

జవహర్ నగర్ వాసులు బతికినా, చనిపోయినా పట్టించుకునేవారు లేరన్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాంకీ సంస్థ ఆర్థిక బలం, పలుకుబడి కారణంగా న్యాయస్థానాల తీర్పులు సైతం అమలుకావడం లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్నవారిపై చర్యలు లేకపోతే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటన కూడా ఈ ప్రాంత దుస్థితిని వెలుగులోకి తెచ్చిందని గుర్తుచేశారు.

డంపింగ్ యార్డు చుట్టూ సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో కాలుష్య ప్రభావం కనిపిస్తోందని, మహిళలకు గర్భస్రావాలు జరుగుతున్నాయని, పిల్లలు చర్మవ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని ఈటల పేర్కొన్నారు. పరిస్థితి నరకప్రాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాంకీ సంస్థ సామాజిక బాధ్యత నిధులను స్థానికుల తాగునీరు, రహదారుల అభివృద్ధికి వినియోగించకుండా ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సమస్య పరిష్కారం కోసం తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, సమావేశం నిర్వహించుకోవాలని సూచించినప్పటికీ నాలుగు నెలలుగా ఎలాంటి మార్పు రాలేదని ఈటల తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలంటే అక్కడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కాలుష్యరహిత సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. చెత్త నుంచి విద్యుత్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసి వ్యర్థాలను పూర్తిస్థాయిలో రీసైక్లింగ్ చేయవచ్చన్నారు.

డంపింగ్ యార్డులో వ్యర్థాలు ఏరుకుని జీవించే వారికి కూడా రాంకీ సంస్థ అడ్డంకులు సృష్టిస్తోందని, ఆ పనిని సైతం సంస్థే చేయాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో పాటు కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసినట్లు వెల్లడించారు. ఢిల్లీలో భారీ మొత్తంలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నప్పుడు జవహర్ నగర్‌లోనూ సమర్థవంతమైన విధానం అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కాలుష్యం 12 లక్షల కార్ల నుంచి వెలువడే కాలుష్యంతో సమానమని ఆయన పేర్కొన్నారు.

ఈ నెల 27 నుంచి పాదయాత్ర ప్రారంభించి బాధితుల తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తానని ఈటల ప్రకటించారు. ప్రతి బాధిత కుటుంబం నుంచి ఒకరు చొప్పున ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జవహర్ నగర్‌కు ఇకపై ఒక్క కిలో వ్యర్థం కూడా రాకూడదని, ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయాలని డిమాండ్ చేశారు.

“పాలకులకు వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. గొప్ప పదవి పొందడం కాదు.. ఆ పదవికి ఎంత న్యాయం చేస్తున్నామన్నదే ముఖ్యం. రేవంత్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోతారా, ప్రజలకు గుర్తుండిపోయేలా పనిచేస్తారా అనేది నిర్ణయించుకోవాలి” అని ఈటల వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అంశంలోనూ రాజకీయ కక్షలతో తెలంగాణ రైతులు, ప్రజలకు నష్టం కలగకూడదని తాను చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రజా సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని కోరారు.

#Sidhumaroju

Alwal