Bharat Aawaz

సంతకం నకిలీ.. ప్రభుత్వ భూమికి పట్టా.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
144
Views

● ఎమ్మార్వో సంతకం ఫోర్జరీపై ఆరోపణలు

● ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తి పేరుతో నమోదు

● పాస్‌పుస్తకం జారీపై అధికారుల విచారణ

అల్వాల్, అక్టోబరు 1: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో సుమారు రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తి పేరుతో పట్టాగా మారిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

మంగళ్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 96లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది.

బొంగ్లూర్‌లోని విశ్వేశ్వరయ్య కళాశాల వెనుక ఉన్న సర్వే నంబర్ 96లో మొత్తం 4.36 ఎకరాల భూమి ఉంది. ఇందులో 4.25 ఎకరాలు వహీదా బేగం పేరుతో పట్టా పాస్‌పుస్తకం జారీ అయినట్లు రికార్డుల ద్వారా వెల్లడైంది. 

ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతా రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన ప్రమేయం లేకుండానే సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించామని, ఈ వ్యవహారం సెప్టెంబర్ 17న తన దృష్టికి వచ్చిందని తహసీల్దార్ పేర్కొన్నారు.

పట్టా పాస్‌పుస్తకం జారీకి సమర్పించిన పత్రాలు, తహసీల్దార్ సంతకం, సంబంధిత ఫైళ్లు, ఆమోద ఉత్తర్వులు, రికార్డుల్లో జరిగిన మార్పుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 

భూమి ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తి పేరుతో పట్టా ఎలా జారీ అయిందనే అంశంపైనా విచారణ కొనసాగుతోంది.

పట్టాను రద్దు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ సునీతా రెడ్డి తెలిపారు.

రికార్డుల్లో మార్పులు ఎప్పుడు, ఏ విధంగా జరిగాయి, ఇందుకు బాధ్యులెవరనే అంశాలు విచారణలో తేలాల్సి ఉంది.

#Sidhumaroju

Alwal