Bharat Aawaz

2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ — అదే తప్పులు పునరావృతమైతే 2023 ఫలితం తప్పదా? -శ్రీను రావు పొన్నాల

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
4 min read
0
Comments
281
Views

2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే అనుకూల పరిస్థితులు ఉన్నాయనే నమ్మకంతో గతంలో జరిగిన తప్పులను మళ్లీ పునరావృతం చేస్తే 2023 ఎన్నికల ఫలితమే తిరిగి ఎదురయ్యే అవకాశం ఉందన్నది కాదనలేని రాజకీయ వాస్తవం.

తెలంగాణ అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎంతో పట్టుదలతో పనిచేశారనేది ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల్లోనూ ఉన్న అభిప్రాయం. అయితే ఆయనకు తెలియకుండా, ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయనే విమర్శలు కూడా గతంలో బలంగా వినిపించాయి

ముఖ్యంగా అధికారంలో ఉన్న సమయంలో కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు రాజకీయ చర్చల్లో పదేపదే వచ్చాయి. అధికారాన్ని కోల్పోయిన తరువాత కొందరు నాయకులు పార్టీ మారడం, ఇప్పుడు తిరిగి బీఆర్‌ఎస్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా మీడియాలో కనిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో 2029లో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి? ఎవరికి బాధ్యతలు అప్పగించాలి? ఎవరికి టికెట్ ఇవ్వాలి? అనే అంశాల్లో అధినాయకత్వం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..

గతంలో పనిచేసిన ప్రాంతీయ ఇన్‌చార్జీల విషయంలో కూడా సమీక్ష అవసరం. ప్రజల్లో మంచి పేరు ఉన్న నాయకులకు, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్థిక బలం ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం కాకుండా, ప్రజలతో సంబంధం, పార్టీ పట్ల నిబద్ధత, గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

అధికారం తిరిగి వస్తే గతంలో సంపాదించిన దానికంటే మరింత సంపాదించాలనే ధోరణి ఉన్న నాయకులకు అవకాశం ఇస్తే, అది పార్టీకి మళ్లీ నష్టమే. అదే విధంగా గతంలో పార్టీని వీడి వెళ్లిన ప్రతి ఒక్కరినీ ఎలాంటి పరిశీలన లేకుండా తిరిగి చేర్చుకోవడం కూడా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణం కావచ్చు

2029లో బీఆర్‌ఎస్‌కు అవకాశం రావడం ఒక విషయం. ఆ అవకాశాన్ని విజయంగా మార్చుకోవడం మరో విషయం.

కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పార్టీ అంతర్గతంగా ప్రక్షాళన, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత, ప్రజలతో నిరంతర సంబంధం, అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండే నాయకత్వం అవసరం.

లేకపోతే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, అదే నాయకులు, అదే పద్ధతులు, అదే తప్పులు కొనసాగితే 2023 ఎన్నికల ఫలితం మరోసారి పునరావృతం కావచ్చనే హెచ్చరికను బీఆర్‌ఎస్‌ నాయకత్వం విస్మరించకూడదు.

— శ్రీను రావు పొన్నాల.