Bharat Aawaz

ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
241
Views

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్షణం అలసత్వం ఓ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఆరుబయట ఆడుకుంటూ వెళ్లిన ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించిన విషాద ఘటన కెరమెరి మండలంలో చోటుచేసుకుంది.ఘటన వివరాల్లోకి వెళితే..స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కెరమెరి మండల పరిధిలోని ధనోర గొండుగూడ (గుండుగూడ) గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మి (4) అనే చిన్నారి బుధవారం ఉదయం తన ఇంటి సమీపంలో ఆరుబయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఆడుకుంటూ ఆడుకుంటూ గ్రామానికి కాస్త సమీపంలోనే ప్రవహిస్తున్న ధనోర వాగు వద్దకు వెళ్ళింది. అక్కడ అడుగు తప్పి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడిపోయింది.కాసేపటి తర్వాత చిన్నారి లక్ష్మి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. చివరకు వాగు వద్దకు వెళ్లి చూడగా, బాలిక నీటిలో మునిగిపోయి అపస్మారక స్థితిలో కనిపించింది. గమనించిన కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు వెంటనే ఆ చిన్నారిని నీటి నుంచి బయటకు తీసి, అత్యవసర చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఆసుపత్రిలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆ పాప మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లెదుటే నవ్వుతూ ఆడుకున్న కన్నబిడ్డ శవమై పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ధనోర తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న కెరమెరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

భారత్ ఆవాజ్ హెచ్చరిక: వర్షాకాలంలో వాగులు, వంకలు నిండి ప్రవహిస్తున్నందున, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరియు తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వారిని ఒంటరిగా బయటకు వదలకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము.