బీజేపీ స్ట్రాటజీ మరో కోణం

0
178

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియా లో, మీడియా లో ఒక విధమైన చర్చ మొదలైంది. ఫైర్ బ్రాండ్ అన్నామలై ని దూరం పెట్టినందుకే NDA  నష్ట పోయిందన్న అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. 

‎కానీ ఫలితాల సరళిని మరో కోణం లో చూస్తే బీజేపీ ఒక ఫర్ఫెక్ట్ స్ట్రాటజీతోనే వెళ్తోందనిపిస్తోంది.

‎బీజేపీ జాతీయ నాయకత్వానికి ప్రాంతీయ పార్టీల బలం పై  స్పష్టమైన అవగాహన ఉంది. 

‎కాంగ్రెస్ ను ఢీ కొట్టినంత సులువుగా ప్రాంతీయ పార్టీ లను ఓడించలేమన్న విషయమూ ఆ పార్టీ పెద్దలకూ తెలుసు.

‎అందుకే  ముందుగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చాలన్న ఎత్తు గడ ను అమలు చేస్తోంది. ఈ క్రమంలో మరో పార్టీకి లాభం కలిగినా ఫర్వాలేదని...దీర్ఘ కాలంలో తమకే కలిసి వస్తుందన్న అంచనా కమల నాథులది.

‎ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి  తప్పించడమే. సంజయ్ వల్ల రాష్ట్రం లో అప్పుడు పార్టీకి చాలా ఊపు వచ్చింది. బీఆర్ఎస్ -కాంగ్రెస్ -బీజేపీ మధ్య  త్రిముఖ పోటీ హోరా హోరి గా ఉంటుందని విశ్లేషణలు జరిగాయి. అయితే బీజేపీ అధిష్టానం లెక్కలు వేరేలా ఉన్నాయి. సంజయ్ దూకుడు వల్ల రాష్ట్రం లో పార్టీ బలపడుతున్నా....BRS ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి కేసీఆర్ మళ్ళీ అధికారం లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ పోరులో ఒక వేళ కాంగ్రెస్ గెలిచినా....మళ్ళీ ఎన్నికల్లో  ఓడించగలం కానీ.... BRS గెలిస్తే KCR తో వేగలేమని భావించిందన్నది నమ్మలేని నిజం.

‎‎( వాస్తవానికి అప్పట్లో బండి సంజయ్ ని తప్పించడానికి రకరకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి.  సొంత పార్టీ నేతలే  ఫిర్యాదులు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే సంజయ్ లాయాల్టీ, క్రేజ్ పై కేంద్ర నాయకత్వానికి గట్టి నమ్మకం ఉంది. అయినా అప్పుడు ఒక వ్యూహంలో భాగంగానే సంజయ్ ని తప్పించారనడానికి... తర్వాత కాలం లో ఆయనకిస్తున్న ప్రాధాన్యతను బట్టి అర్థం చేసుకోవచ్చు ) 

‎మొత్తానికి కేసీఆర్ ను గద్దె దించడంలో అప్పుడు బీజేపీ సక్సెస్ అయింది.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను మట్టి కరిపించే వ్యూహంతో ముందుకు వెళుతోంది.  అప్పటికీ బలం సరిపోకుంటే ఇదే BRS తో పొత్తు లేదా అవగాహన కుదుర్చుకున్నా ఆశ్చర్య పొనక్కర్లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు కదా. ఎవరి అవసరం వారిది. 

‎#తమిళనాడు లోనూ అదే ఫార్ములా..!

‎ఇక తమిళనాడు లో ఉన్న సమీకరణల దృష్ట్యా అధికార DMK ను ఓడించలేమన్న అంచనా బీజేపీ కి మొదటి నుంచి ఉంది. ద్రవిడ రాజకీయాల్లో ఎక్కువ గా కలగజేసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని భావించింది. అందుకే  AIADMK ను ముందు పెట్టి ఎన్నికలను ఎదుర్కొంది. ఫైర్ బ్రాండ్ అన్నామలై లాంటి నేతలు ఎక్కువ గా తిరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా చీలి... అధికార DMK కే లాభం చేకూరే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. అన్నామలైని సైలెంట్ చేసేసింది. ఆయన కూడా పార్టీ లైన్ లో ఫర్ఫెక్ట్ గా పని చేశారు. ఎంత వరకు కొట్లాడాలో అంత వరకు కొట్లాడారు.  మొత్తానికి తాము గెలవక పోయినా... కొరకరాని కొయ్య లాంటి DMK ను గద్దె దించడం లో సక్సెస్ కాగలిగారు. అతి పెద్ద పార్టీ గా అవతరించిన  TVK తమతో కలిసి వస్తే సరే సరి... లేకుంటే రాబోయే రోజుల్లో  అనూహ్య  పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం.

‎ఇప్పటి వరకు కమలనాథులు  ఫర్ఫెక్ట్ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు.  అలా అని భవిష్యత్ లోనూ ఈ వ్యూహాలన్నీ సక్సెస్ అవుతాయన్న గ్యారంటీ లేదు.   అయితే సెక్యులర్ పార్టీల నాయకుల  ఓవరాక్షన్ తో... హిందూ ఓట్లు ఏకీకృతం అవుతున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విన్నారు కదా... ఆమె బీజేపీ ని విమర్శించడంలో తప్పు లేదు... కానీ రామున్ని కోట్ చేయడం వల్లనే హిందువుల్లో నెగటివ్ ఇంపాక్ట్ పడుతోంది. ఇలాంటివి  రాబోయే కాలంలోనూ బీజేపీ కి కలిసొచ్చే అంశాలు.

‎ ఏ పార్టీ కూడా అహోబిలం మఠం కాదు. అందరివీ ఓటు బ్యాంకు రాజకీయాలే. 

‎ప్రజా స్వామ్య అపహాస్యం... రాజ్యాంగ ఉల్లంఘన లాంటి పదాలకు ఇప్పుడు విలువ లేదు.  అందరికీ గెలుపే ముఖ్యం...! అధికారమే లక్ష్యం..!

Search
Categories
Read More
SURAKSHA
Peeyush Pandey IPS: Securing Bengal with Excellence
A 1993-batch West Bengal cadre officer whose career spans security leadership, police...
By Lokeshwari Panthadi 2026-07-28 11:45:10 0 115
SURAKSHA
TN Police Today: Fighting Social Evils With Courage
Today TN police officers fought against social evils across state. Village meetings held against...
By Kalaga Sailaja 2026-07-04 08:09:57 0 75
Andhra Pradesh
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు! విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, తల్లుల...
By Chennaiah Kati 2026-06-18 08:55:03 0 134
Andhra Pradesh
జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.
పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ...
By Pagadala Venkateswar 2026-06-20 04:41:10 0 108
Andhra Pradesh
విచారణ పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై సీఐ దాడి.. నిరసన.
మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తనపై బూటు కాళ్లతో దాడి చేశారని బెంగళూరులో సాఫ్ట్‌వేర్...
By Pagadala Venkateswar 2026-05-27 06:08:29 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com