Bharat Aawaz

గ్రామ అభివృద్ధికి కుత్తుం లక్ష్మణ్ రూపవతి దంపతుల విశేష కృషి!

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
5 min read
0
Comments
180
Views

రహదారులు, విద్యుత్, తాగునీరు, ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం.. రూ.27 లక్షల విరాళాల సేకరణలో కీలక పాత్ర

పలాస మండలం: గ్రామ అభివృద్ధే ధ్యేయంగా కుత్తుం లక్ష్మణ్ చేసిన కృషి గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రహదారులు, విద్యుత్, తాగునీరు, దేవాలయాలు, శ్మశానవాటిక అభివృద్ధికి ఆయన ప్రత్యేక చొరవ చూపినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.

గ్రామంలోని రామాలయం వీధికి డబుల్ సీసీ రోడ్డు, బైరెడ్డి తల్లి గ్రామదేవత ఆలయానికి సీసీ రోడ్డు, ఉజ్జిడమ్మ తల్లి ఆలయం నుంచి శ్మశానవాటిక మీదుగా మెయిన్ వీధి వరకు, పెరట నుంచి సరియపల్లి వరకు, గ్రామం నుంచి గుడ్డిపద్ర రోడ్డు వరకు, చిన్న గురుదాసుపురం వరకు రోడ్ల మంజూరుకు కృషి చేశారు. అలాగే గ్రామం నుంచి గేట్ వరకు ఉన్న తారు రోడ్డు మరమ్మతులు, కిల్లమ్మ వంపు నుంచి తారు రోడ్డు వరకు గ్రావెల్ రోడ్డు, నుయ్యి రోడ్డు అభివృద్ధికి చొరవ తీసుకున్నారు.

విద్యుత్ సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామం నుంచి దేవాలయానికి, బోర గోర్జీ ప్రాంతంలోని రైతులకు, శ్మశానవాటికకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు కృషి చేశారు. గ్రామంలో వాటర్ ట్యాంకుల నిర్మాణం, సుజల నీటి ట్యాంకు ఏర్పాటు, శ్మశానవాటికకు ప్రహరీ నిర్మాణ పనుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

దేవాలయ అభివృద్ధికి రూ.27 లక్షల విరాళాలు

గ్రామదేవత ఆలయ అభివృద్ధికి కుత్తుం లక్ష్మణ్ విశేషంగా కృషి చేసినట్లు గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు. అండమాన్ నుంచి హైదరాబాద్ వరకు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్తులతో పాటు స్థానికులను సంప్రదించి సుమారు రూ.27 లక్షల విరాళాల సేకరణలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా దేవాదాయ శాఖ నుంచి గ్రామదేవత ఆలయానికి నిధులు సమకూరేలా కృషి చేశారు.

పార్టీలకు అతీతంగా ప్రజాసేవ

గ్రామ ప్రజలకు పార్టీలకు అతీతంగా పింఛన్లు, కొత్త ఇళ్ల మంజూరు, స్వచ్ఛమైన తాగునీటి కోసం బోర్ల ఏర్పాటు వంటి సంక్షేమ కార్యక్రమాల్లోనూ తనవంతు సహకారం అందించినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదుగుదల

సాధారణ టీడీపీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కుత్తుం లక్ష్మణ్ అనంతరం పార్టీ కార్యదర్శిగా, మండల అధ్యక్షుడిగా, సర్పంచ్‌గా, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్‌గా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంతో పాటు పలాస మండలంలోనూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.

వ్యక్తిగత రాజకీయ ఎదుగుదలతో పాటు స్వగ్రామ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పనిచేయడం అభినందనీయమని ఆయనకు మద్దతుగా నిలుస్తున్న గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గ్రామ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షిస్తున్నారు.