Bharat Aawaz

చీకట్లో పలాస-కాశీబుగ్గ: వెలగని వీధి దీపాలు.. కుక్కల భయంతో పుర ప్రజలు బెంబేలు!

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
313
Views

పలాస: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధులు అంధకారంలో మునిగిపోయాయి. గత రెండు రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో జంట పట్టణాల్లోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధులు కూడా చిమ్మచీకటిని తలపిస్తున్నాయి. సాయంత్రం దాటితే చాలు కనీస వెలుతురు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఒకవైపు ఎడతెరిపి లేని వర్షాలతో రహదారులపై నీరు నిలిచిపోగా, మరోవైపు వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రివేళ నడవడమే ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు చీకటి పడగానే వీధుల్లో కుక్కల సంచారం విపరీతంగా పెరిగింది. గుంపులు గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు చీకట్లో ఎటు నుంచి దాడి చేస్తాయో తెలియక పాదచారులు, ద్విచక్ర వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు రాత్రిపూట బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు.

అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు, విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే చిరు వ్యాపారులు, కార్మికులు ఈ చీకటి వల్ల నానా అవస్థలు పడుతున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టాలని, వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.