నామినేషన్ వేయించి.. బీఫామ్ ఇవ్వకపోవడంపై కార్యకర్తల ఆవేదన
పలాస: పలాస మండలంలో జనసేన పార్టీకి MPTC స్థానాలు కేటాయించకపోవడం, అభ్యర్థితో నామినేషన్ ఉపసంహరింపజేయడంపై జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండలంలోని 19 పంచాయతీల పరిధిలో 11 MPTC స్థానాలు ఉన్నప్పటికీ, ఒక్క స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బొడ్డపాడు పంచాయతీ పరిధికి చెందిన పోతనపల్లి చిరంజీవితో స్థానిక నాయకులు నామినేషన్ వేయించి, బీఫామ్ ఇస్తామని హామీ ఇచ్చారని, చివరకు బీఫామ్ అందక నామినేషన్ ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్యకర్తలు ఆరోపించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పలాస మండలంలో జనసేనకు ఒక్క MPTC స్థానం కూడా దక్కకపోవడం నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించలేని నాయకులు తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తల శ్రమకు తగిన గుర్తింపు, పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని వారు పేర్కొన్నారు.