Bharat Aawaz

ప్లాస్టిక్‌కు స్వస్తి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం! అయ్యప్ప స్వాములకు స్టీల్ ప్లేట్ల పంపిణీ

Thupakula Mahesh
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
5
Views

ప్లాస్టిక్‌కు స్వస్తి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం! అయ్యప్ప స్వాములకు స్టీల్ ప్లేట్ల పంపిణీ

 

తల్లాడ: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణతో పాటు అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాముల ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష నరసింహచారి వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 

తల్లాడ మండలం మంగాపురం గ్రామంలో అయ్యప్ప మాలధారణ చేసి దీక్షలో ఉన్న స్వాములకు ఆదివారం తన సొంత ఖర్చులతో స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. తన తల్లిదండ్రులు రుద్రాక్ష అంజయ్య, వెంకటరమణల పేరిట ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగాపురం అయ్యప్ప స్వామి పీఠం గురుస్వామి చాపల వెంకటేశ్వర్లుకు స్టీల్ ప్లేట్లను అందజేశారు.

 

ఈ సందర్భంగా నరసింహచారి మాట్లాడుతూ, అయ్యప్ప స్వాములు 41 నుంచి 45 రోజుల పాటు కఠిన నియమనిష్టలతో దీక్షను కొనసాగిస్తారని తెలిపారు. ఈ సమయంలో భిక్ష, ప్రసాదాలు స్వీకరించేందుకు అనేక చోట్ల ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా, వేడి ఆహారాన్ని కొన్ని రకాల ప్లాస్టిక్ పాత్రల్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు.

 

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లేట్లను వినియోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గించవచ్చని, వాటిని శుభ్రం చేసుకుని పదేపదే ఉపయోగించుకోవచ్చని తెలిపారు. భక్తులు సైతం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

 

తన తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని నరసింహచారి పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మంగాపురం గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు, భక్తులు, నరసింహచారి కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములకు స్టీల్ ప్లేట్ల పంపిణీ చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.