Bharat Aawaz

కొత్తగూడెంలో 'మిషన్ బాల్ సురక్ష, శిక్షా మరియు న్యాయ 2026' అవగాహన సదస్సు!

Thupakula Mahesh
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
12
Views

కొత్తగూడెంలో మిషన్ బాల్ సురక్ష సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత బాలల హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

 

బాలల హక్కుల పరిరక్షణ, వారికి సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. ప్రేమలత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మిషన్ బాల్ సురక్ష, శిక్షా మరియు న్యాయ 2026 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నియమితులైన ఉపాధ్యాయులకు శనివారం కొత్తగూడెం జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్‌లో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జి. ప్రేమలత మాట్లాడుతూ ప్రతి బాలబాలికకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, విద్యా హక్కు, రక్షణ, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అందేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. విద్యార్థుల ప్రవర్తన, మానసిక స్థితి, చదువులో ఎదురయ్యే సమస్యలను ఉపాధ్యాయులు గుర్తించాలని సూచించారు. బాలలపై వేధింపులు, వివక్ష, నిర్లక్ష్యం, దోపిడీ వంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. బాలల హక్కులకు భంగం కలిగించే సంఘటనలు ఎదురైతే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలల పరిరక్షణ చట్టాలపై అవగాహనతో పాఠశాలల్లో సురక్షితమైన విద్యా వాతావరణాన్ని కల్పించవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. బాలలకు న్యాయం అందించేందుకు ఉపాధ్యాయులు, సంబంధిత శాఖలు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ ముదుల్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి శంభు ప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, డీసీపీయూ మట్ట హరికుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ పాఠశాలల నుంచి నామినేట్ అయిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.