Bharat Aawaz

ప్రశాంతమైన పలాస కోసం వైఎస్సార్‌సీపీని గెలిపించండి: సీదిరి అప్పలరాజు

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
534
Views

పలాస మున్సిపల్ ఎన్నికల వేళ పలాస-కాశీబుగ్గ ప్రజలకు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి పిలుపు 

 

 

పలాస:పలాస నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం తిరిగి నెలకొనాలంటే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.

 

నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న తమ పార్టీ అభ్యర్థులకు ప్రత్యర్థులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల సాధన కోసం తమ అభ్యర్థులు ధైర్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు.

 

అక్రమాలపై ఆరోపణలు

గత రెండున్నరేళ్ల పాలనలో నియోజకవర్గంలో దౌర్జన్యాలు, అక్రమాలు మితిమీరాయని అప్పలరాజు విమర్శించారు. అమాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని, భార్యాభర్తల గొడవల్లోనూ జోక్యం చేసుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పలాస-కాశీబుగ్గలో ప్రతి మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. కూటమి అభ్యర్థులు గెలిస్తే ఈ వసూళ్లు, దౌర్జన్యాలు మరింత పెరుగుతాయని ప్రజలను హెచ్చరించారు.

 

అభివృద్ధి మా హయాంలోనే

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పలాసలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, స్మార్ట్ లేఅవుట్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, మార్కెట్ సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించామని వివరించారు. తాము పూర్తి చేసిన పనుల వద్ద కొబ్బరికాయలు కొట్టి ఫొటోలు దిగడం తప్ప ప్రత్యర్థులు పట్టణానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

 

ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి

పలాస-కాశీబుగ్గ ప్రజలు ఆలోచించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వైఎస్సార్‌సీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. మద్యంపై అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు కావాలో, ప్రజల మధ్య ఉంటూ నిరంతరం సేవ చేసే తమ అభ్యర్థి పద్మశ్రీ కావాలో ఓటర్లే నిర్ణయించుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ గెలుపుతోనే పలాసకు పూర్వవైభవం, శాంతిభద్రతలు సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.