Bharat Aawaz

కొండవాలు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ గణబాబు విస్తృత పర్యటన

Santhosh Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
228
Views

– అల్పపీడన ప్రభావంతో కుండపోత: కొండచరియల నడుమ పశ్చిమ ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలన

– నిర్మాణంలో ఉన్న రక్షణ గోడల (రిటైనింగ్ వాల్స్) పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

 

 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ నగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలో పలుచోట్ల కొండచరియలు, మట్టి దిబ్బలు విరిగిపడి నివాసాలు కొంతమేర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన చేపట్టారు.

59వ వార్డు హనుమాన్ నగర్, 63వ వార్డు పరిధిలోని కాకరలోవ, క్రాంతి నగర్ వంటి అత్యంత సమస్యాత్మక కొండవాలు ప్రాంతాల్లో గురువారం ఆయన స్వయంగా పర్యటించారు. కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న ఇళ్లను నిశితంగా పరిశీలించి, భయాందోళనల్లో ఉన్న స్థానికులతో నేరుగా మాట్లాడారు. "ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది.. ఎలాంటి ఆందోళన చెందవద్దు" అంటూ బాధితుల్లో మనోధైర్యాన్ని నింపారు.

అధికారులకు కచ్చితమైన ఆదేశాలు:

పర్యటన సందర్భంగా జీవీఎంసీ, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఎమ్మెల్యే అక్కడికక్కడే సమీక్షించారు.

• రక్షణ గోడల పనులు వేగవంతం: ఆయా కొండవాలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) పనులను ఏమాత్రం జాప్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం లేకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగంగా ముగించాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు.

• తక్షణమే పునరావాస కేంద్రాలకు: కొండవాలుపై అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న నివాసితులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.

• వైద్య సహాయం: బాధిత కుటుంబాలకు తాగునీరు, వేడి ఆహారం అందించడంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.

కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, ప్రమాదకరమైన వర్షంలో స్వయంగా కొండవాలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గణబాబు చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.