Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లె: మదనపల్లె పట్టణ పరిధిలోని ఆసుపత్రులు, ప్రైవేట్ హాస్పిటళ్లు, లాడ్జీలు, హోటళ్లు, పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్‌లో అగ్నిమాపక భద్రతా నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరపాలని బహుజన యువ సేన (BYS) డిమాండ్ చేసింది. ఈ మేరకు బహుజన యువ సేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ నేతృత్వంలో స్థానిక ఫైర్ ఆఫీసర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. వందలాది మంది ప్రజలు, రోగులు, విద్యార్థులు రాకపోకలు సాగించే బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
    4 Views
  • మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిత్తూరు బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ముఖ్యంగా సాయంత్రం వేళ వాహనాల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభిస్తోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు తగినంత మంది పోలీసులు కనిపించడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉన్నారో.. ఈ సమస్యను ఎవరు పట్టించుకుంటారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత ట్రాఫిక్ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిత్తూరు బస్టాండ్ మార్గంలో, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సిబ్బందిని అందుబాటులో ఉంచి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    4 Views
  • మదనపల్లె: మదనపల్లె మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జన్నే కిరణ్మయి శేష విజయం సాధించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా పట్టుదలతో నామినేషన్ వేసి ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఎన్నికల్లో పోటీ చేసి జనసేన అభ్యర్థి కొప్పుల రమ్యపై 1,326 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు విజయం ఖరారైంది. నామినేషన్ దశలో ఎదురైన ఇబ్బందులను అధిగమించి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా తీర్పుతో జెడ్పీటీసీగా విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    3 Views

  • 11-11-2026 Wed

    విజయవాడలో 25 రోజుల పాటు నిర్వహించనున్న బులుసు అపర్ణ
    డిసెంబరు 10న ప్రారంభం, జనవరి 3న ధారణతో ముగింపు
    ప్రారంభోత్సవానికి మాడుగుల, ముగింపు సభకు గరికిపాటి
    ఒకేసారి వెయ్యి పద్యాలతో అరుదైన ఘట్టానికి శ్రీకారం
    తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి విజయవాడ నగరం వేదిక కానుంది. అత్యంత క్లిష్టమైన సాహిత్య ప్రక్రియగా పేరుగాంచిన "సహస్రావధానం"ను తొలిసారిగా ఒక మహిళ నిర్వహించబోతున్నారు. ప్రముఖ అవధాని బులుసు అపర్ణ ఈ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. డిసెంబరు 10 నుంచి జనవరి 3 వరకు మొత్తం 25 రోజుల పాటు పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఈ అపూర్వ సాహిత్య యజ్ఞం జరగనుంది.

    మంగళవారం విజయవాడ కేబీఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ హైస్కూల్స్‌ కమిటీ జనరల్‌ కరస్పాండెంట్‌ గోపిశెట్టి మల్లయ్య, కేబీఎన్‌ కళాశాల కరస్పాండెంట్‌ టి.శ్రీనివాసు, అవధాని అపర్ణ ఈ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార ప్రతులను ఆవిష్కరించారు.

    డిసెంబరు 10న ప్రముఖ అవధాన బ్రహ్మ మాడుగుల నాగఫణిశర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 25 రోజుల పాటు వివిధ దశల్లో అవధాన ప్రక్రియ కొనసాగుతుంది. జనవరి 3న జరిగే ముగింపు కార్యక్రమం, ధారణ, విజయోత్సవ సభకు సహస్రావధాని గరికిపాటి నరసింహారావు హాజరుకానుండటం విశేషం.

    ఈ సందర్భంగా అవధాని బులుసు అపర్ణ మాట్లాడుతూ.. "ఇప్పటివరకు 325కు పైగా అష్టావధానాలు, ఏడు శతావధానాలు, రెండు ద్విశతావధానాలు పూర్తి చేశాను. ఇప్పుడు గురువుల ఆశీస్సులతో సహస్రావధానానికి సిద్ధమయ్యాను. డిసెంబరు 10 నుంచి 22 వరకు సమస్యలు, దత్తపదులు, వర్ణన అంశాలను స్వీకరించి, 23 నుంచి వాటి పూరణలు చేస్తాను. జనవరి 3న 750 పద్యాల ధారణతో పాటు ఆశుపద్యాలు, ఘంటావధానంతో కలిపి వెయ్యి పద్యాలను పూర్తి చేస్తాను" అని వివరించారు.
    3 Views

  • 11-11-2026 Wed
    Andhra

    డిసెంబర్ నుంచి పండుగల నేపథ్యంలో పంపిణీకి నిర్ణయం
    రూ.100కే కిలో కందిపప్పు, రూ.125కే లీటర్ పామాయిల్
    పథకం కోసం రూ.300.60 కోట్ల రాయితీ భరించనున్న ప్రభుత్వం
    సరుకుల సేకరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు
    నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉపశమనం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని, డిసెంబర్ నెల నుంచి మూడు నెలల పాటు రేషన్ కార్డుదారులకు రాయితీ ధరలకే నిత్యావసర సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని నిశ్చయించింది.

    ఈ పథకంలో భాగంగా కిలో కందిపప్పును రూ.100, లీటరు పామాయిల్‌ను రూ.125, కిలో గోధుమ పిండిని రూ.25 చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర కిలోకు రూ.170 నుంచి రూ.200 వరకు ఉండటంతో, ప్రభుత్వ నిర్ణయం పేద కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనివ్వనుంది.

    ఈ పథకం అమలుకు ప్రభుత్వం నెలకు రూ.100.20 కోట్లు, మూడు నెలల కాలానికి మొత్తంగా రూ.300.60 కోట్ల మేర సబ్సిడీ భారాన్ని భరించనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కందిపప్పు సరఫరా నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 1.20 లక్షల టన్నుల నిల్వలను కోరగా, ప్రస్తుతం 40,338 టన్నుల ముడి కందులను కేంద్రం కేటాయించింది.

    కేంద్రం కేటాయించిన ముడి కందులను సేకరించి, మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయాలని, అలాగే పామాయిల్ సేకరణకు తక్షణ చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ పథకాన్ని మూడు నెలల అనంతరం కూడా కొనసాగించాలంటే ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
    3 Views