Bharat Aawaz

11-11-2026 Wed

విజయవాడలో 25 రోజుల పాటు నిర్వహించనున్న బులుసు అపర్ణ
డిసెంబరు 10న ప్రారంభం, జనవరి 3న ధారణతో ముగింపు
ప్రారంభోత్సవానికి మాడుగుల, ముగింపు సభకు గరికిపాటి
ఒకేసారి వెయ్యి పద్యాలతో అరుదైన ఘట్టానికి శ్రీకారం
తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి విజయవాడ నగరం వేదిక కానుంది. అత్యంత క్లిష్టమైన సాహిత్య ప్రక్రియగా పేరుగాంచిన "సహస్రావధానం"ను తొలిసారిగా ఒక మహిళ నిర్వహించబోతున్నారు. ప్రముఖ అవధాని బులుసు అపర్ణ ఈ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. డిసెంబరు 10 నుంచి జనవరి 3 వరకు మొత్తం 25 రోజుల పాటు పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఈ అపూర్వ సాహిత్య యజ్ఞం జరగనుంది.

మంగళవారం విజయవాడ కేబీఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ హైస్కూల్స్‌ కమిటీ జనరల్‌ కరస్పాండెంట్‌ గోపిశెట్టి మల్లయ్య, కేబీఎన్‌ కళాశాల కరస్పాండెంట్‌ టి.శ్రీనివాసు, అవధాని అపర్ణ ఈ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార ప్రతులను ఆవిష్కరించారు.

డిసెంబరు 10న ప్రముఖ అవధాన బ్రహ్మ మాడుగుల నాగఫణిశర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 25 రోజుల పాటు వివిధ దశల్లో అవధాన ప్రక్రియ కొనసాగుతుంది. జనవరి 3న జరిగే ముగింపు కార్యక్రమం, ధారణ, విజయోత్సవ సభకు సహస్రావధాని గరికిపాటి నరసింహారావు హాజరుకానుండటం విశేషం.

ఈ సందర్భంగా అవధాని బులుసు అపర్ణ మాట్లాడుతూ.. "ఇప్పటివరకు 325కు పైగా అష్టావధానాలు, ఏడు శతావధానాలు, రెండు ద్విశతావధానాలు పూర్తి చేశాను. ఇప్పుడు గురువుల ఆశీస్సులతో సహస్రావధానానికి సిద్ధమయ్యాను. డిసెంబరు 10 నుంచి 22 వరకు సమస్యలు, దత్తపదులు, వర్ణన అంశాలను స్వీకరించి, 23 నుంచి వాటి పూరణలు చేస్తాను. జనవరి 3న 750 పద్యాల ధారణతో పాటు ఆశుపద్యాలు, ఘంటావధానంతో కలిపి వెయ్యి పద్యాలను పూర్తి చేస్తాను" అని వివరించారు.
3 Views