మంచిర్యాల: మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి అండగా నిలుస్తూ, ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయిలను ఇప్పించడంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ చూపారు. ఆయన కృషి ఫలితంగా నస్పూర్ విభాగానికి చెందిన 131 మంది మున్సిపల్ కార్మికులకు ఐదేళ్ల పీఎఫ్ బకాయిలు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ విభాగానికి చెందిన 131 మంది కార్మికులకు ఐదేళ్లుగా పీఎఫ్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో పాటు ఈఎస్ఐ సౌకర్యాల కల్పన కోసం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో గత మే 1న మేడే సందర్భంగా కార్మికులకు సంబంధించిన రూ.3 కోట్ల పీఎఫ్ బకాయిల చెక్కును ఆయన అందజేశారు. ఎమ్మెల్యే చొరవతో అక్టోబర్ 20న 131 మంది కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఐదేళ్లకు సంబంధించిన పీఎఫ్ బకాయిలు జమయ్యాయి. ఒక్కొక్క కార్మికుడికి లక్ష రూపాయలకు పైగా పీఎఫ్ సొమ్ము అందడంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది.ఐదేళ్ల నిరీక్షణకు తెరదించి తమ కుటుంబాల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీ థియేటర్ చౌరస్తా నుంచి ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గజమాలతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ఆయన చూపిన చొరవను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు, కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ, కార్పొరేటర్లు, మున్సిపల్ కార్మికుల అధ్యక్షుడు కొయ్యల వెంకటి, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.