Bharat Aawaz

పాతాళంలో.. జలం.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
6 min read
0
Comments
29
Views

 

అల్వాల్, నవంబర్ 6: గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. కేవలం అక్టోబర్ నెలలోనే నగర పరిధిలో సుమారు 2.2 లక్షల వాటర్ ట్యాంకర్లు బుక్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రోజుకు సగటున 6 వేల నుంచి 7 వేల ట్యాంకర్ల బుకింగ్‌లు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో 87 వేల బుకింగ్‌లు మాత్రమే ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య రెండున్నర రెట్లకు పైగా పెరిగింది.

- అల్వాల్‌లో 3.74 మీటర్లు.. మల్కాజిగిరిలో 8.49 మీటర్ల లోపల 

మల్కాజిగిరి ప్రాంతంలో భూగర్భజలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. భూగర్భజల శాఖ అక్టోబర్ నెలాఖరు గణాంకాల ప్రకారం అల్వాల్‌లో భూగర్భజల మట్టం భూమి ఉపరితలం నుంచి 3.74 మీటర్ల లోపల ఉండగా, మల్కాజిగిరిలో 8.49 మీటర్ల లోతుకు చేరింది. మేడ్చల్ జిల్లాలో సగటు భూగర్భజల మట్టం 6.66 మీటర్ల లోతులో నమోదైంది. మేడిపల్లిలో అత్యధికంగా 13.06 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. కాప్రాలో 6.46 మీటర్లు, ఉప్పల్‌లో 8.40 మీటర్ల లోతులో భూగర్భజలాలు నమోదయ్యాయి. బోర్లపై ఆధారపడే కాలనీలకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

- జలాశయాల్లో తగ్గుతున్న నిల్వలు

హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులైన సింగూరు, మంజీరా జలాశయాల్లో నిల్వలు గణనీయంగా తగ్గాయి. సింగూరులో పూర్తి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, అక్టోబర్ చివరి నాటికి సుమారు 3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మంజీరా జలాశయంలో 1.5 టీఎంసీలకు గాను 0.19 టీఎంసీల నిల్వ మాత్రమే నమోదైంది. వర్షపాతం లోటు, భూగర్భజలాల రీఛార్జి తగ్గడం కూడా నగర నీటి సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి.

- ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం

బోర్లలో నీరు తగ్గిపోవడంతో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. ప్రభుత్వ ట్యాంకర్ల సరఫరాపై ఒత్తిడి పెరగడంతో బుకింగ్‌లకు ఆలస్యం జరుగుతోంది. ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించే కుటుంబాలు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ నీటి సరఫరా రోజూ కాకుండా ఒక రోజు విడిచి మరో రోజు, మరికొన్ని చోట్ల మూడు రోజులకోసారి జరుగుతోంది.

-నీటి నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నలు

జలాశయాల్లో నీరు అందుబాటులో ఉన్నప్పుడే భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిల్వలు నిర్వహించాల్సి ఉండగా, నీటిని దిగువకు విడుదల చేయడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలంలో లభించిన నీటిని సమర్థంగా వినియోగించుకోవడం, తాగునీటి అవసరాలకు తగిన నిల్వలు ఉంచడం, ప్రత్యామ్నాయ నీటి వనరులను ముందుగానే సిద్ధం చేయడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

- వేసవికి ముందే అప్రమత్తం కావాలి

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రత్యామ్నాయ నీటి వనరుల నుంచి అదనపు సరఫరాకు చర్యలు చేపడుతోంది. మిషన్ భగీరథ ద్వారా అదనంగా 40 మిలియన్ గ్యాలన్ల నీటిని డిసెంబర్ 15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. శుద్ధి చేసిన మురుగునీటిని నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కుల అవసరాలకు సరఫరా చేసే గ్రీన్ వాటర్ ట్యాంకర్ల విధానాన్ని కూడా ప్రారంభించింది. అయినప్పటికీ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జలాశయాల నిల్వలు, భూగర్భజలాల సంరక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది.

#Sidhumaroju

Alwal