Bharat Aawaz

కొత్తగూడెం మురసు తుఫాన్ పంట నష్టంపై డీఏవో బాబురావు క్షేత్ర పరిశీలన!

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
5 min read
0
Comments
52
Views

మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల సంరక్షణకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు.

 

కొత్తగూడెం: మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను సంరక్షించుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తగూడెం మండలం సుజాతనగర్ గ్రామంలో నేలకొరిగిన వరి పంట పొలాలను చైతన్య రెడ్డి, కొత్తగూడెం వ్యవసాయ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ), సుజాతనగర్ మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల పరిస్థితిని, వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.

 

ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మాట్లాడుతూ, వరి పంట నేలకొరిగిన ప్రాంతాల్లో పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే బయటకు పంపించాలని సూచించారు. నీరు ఎక్కువ సమయం నిల్వ ఉండకుండా మురుగు కాలువల ద్వారా నీటిని తొలగించాలని తెలిపారు. వరి కంకులు తడిసి ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఉన్నచోట ఒక ట్యాంకు నీటిలో 100 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయడం ద్వారా మొలకలు రాకుండా నివారించవచ్చని అన్నారు . మిరప పంట సాగు చేస్తున్న రైతులు భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నేలకొరిగిన మొక్కలను తిరిగి నిలబెట్టి కర్రలు లేదా ఇతర ఆధారాలతో కట్టుకోవాలని సూచించారు. మొక్కల మొదళ్ల వద్ద మట్టిని ఎగదోసి మొక్కలు పడిపోకుండా చూడాలని, చేలల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన పారుదల సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అధిక తేమ కారణంగా తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉన్నందున పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

 

జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు బాబురావు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 1600 ఎకరాల్లో మినుము పంట, 1,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలిస్తూ వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులు పంటల సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని, అవసరమైన సాంకేతిక సలహాల కోసం సమీప వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఆ ప్రకటనలో కోరారు.