● ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు శాశ్వత పరిష్కారం కోసం ఉద్యమం
● ఈ నెల 25న రౌండ్‌టేబుల్ సమావేశం
● 27 నుంచి పాదయాత్ర.. ప్రజలంతా కలిసి రావాలని ఎంపీ పిలుపు
అల్వాల్,అక్టోబర్23:జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. డంపింగ్ యార్డ్‌ను తరలించాలని కోరుతూ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కాలుష్య నియంత్రణ, ప్రత్యామ్నాయ పరిష్కారాలపై ఆయన మాట్లాడారు. ఈ నెల 25న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి, అనంతరం పాదయాత్రను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మీథేన్ ఉద్గారాలు వెలువరిస్తున్న 25 ప్రధాన వ్యర్థ కేంద్రాల్లో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ నాలుగో స్థానంలో ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి పర్యావరణానికి, ప్రజల జీవనానికి ఆందోళనకరమని అన్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న లీచేట్ నీటి వల్ల చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్లో గర్భస్రావాలు, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్న విషయాలను ప్రస్తావించారు. ఈ సమస్యలపై సమగ్ర వైద్యపరమైన, శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించి ప్రజలకు వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని కోరారు.
డంపింగ్ యార్డ్ ప్రభావం సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలపై పడుతోందని ఈటల రాజేందర్ అన్నారు. కీసర, ఘట్‌కేసర్, దమ్మాయిగూడ తదితర ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం చేస్తున్నారని, కాలుష్యం వల్ల వారి జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలపై మీడియా, పత్రికలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
డంపింగ్ యార్డ్ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించానని, కేంద్ర మంత్రి కట్టర్‌ను కలిసి వివరించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకురావాలని సూచించారని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని అన్నారు. చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించి దుర్వాసన, లీచేట్ సమస్యలను నియంత్రించాలని, అవసరమైతే అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, హైదరాబాద్ నగర ప్రతిష్ఠకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు. జవహర్‌నగర్‌లో సకల జనుల సమ్మె తరహాలో ఐక్య పోరాటం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఈ ఉద్యమానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిసివస్తామని తెలిపారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ఈటల రాజేందర్ చేపట్టనున్న పాదయాత్రలో తాము కూడా పాల్గొంటామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.
సమావేశంలో బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకుడు మోహన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎస్. మల్లారెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్‌రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ నేత సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గండే, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్.కే. శ్రీనివాస్, మాణిక్‌రెడ్డి, తిర్మల్‌రెడ్డి, తిరుపతి యాదవ్, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దేవేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శామీర్‌పేట్ మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, జవహర్‌నగర్ మాజీ కార్పొరేటర్ బాబు, మాజీ ఎంపీటీసీ రషీదా బేగం, కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ ఆనంద్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal