
- కూటమి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
- అన్ని ఎంపీటీసీ స్థానాల్లో గెలిచి ఎమ్మెల్యేకు కానుకగా అందిస్తాం: కుత్తుం లక్ష్మణ్
పలాస:
పలాస మండల పరిషత్ అధ్యక్ష పదవికి కూటమి అభ్యర్థిగా కుత్తుం రూపవతిని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారికంగా ప్రకటించారు. పలాస మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్ సతీమణి అయిన రూపవతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా కుత్తుం లక్ష్మణ్ మాట్లాడుతూ, పలాస మండలంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించి, అన్ని ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో సాధించే సంపూర్ణ విజయాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీషకు కానుకగా అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం, అభివృద్ధి పనులపై చూపిన నిర్లక్ష్యాన్ని ప్రజలు గుర్తించారని ఆయన విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే అంతిమ విజయమని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.