Bharat Aawaz

పలాస అభివృద్ధికి మా పనులే సాక్ష్యం: సీదిరి

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
59
Views

36 వార్డుల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించండి

పలాస:గత ఐదేళ్లలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధికి రహదారులు, వైద్యం, విద్య, గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగాల్లో అనేక పనులు చేపట్టామని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. పలాసలోని జి.ఎం.ఇ. కాలనీ వైకాపా కార్యాలయం ‘ప్రగతి భవన్‌’లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థి తలాసు శ్రీపద్మతోపాటు 36 వార్డుల అభ్యర్థులను ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కేటీ రోడ్డు, వివేకానంద మార్గ్‌, ఆంధ్రా బ్యాంకు రోడ్డు విస్తరణ, ముత్యాలమ్మ కోనేరు ఆధునికీకరణ చేపట్టామని చెప్పారు. వైఎస్సార్‌ కిడ్నీ పరిశోధన ఆసుపత్రి, సీహెచ్‌సీ ఆధునికీకరణ (రూ.5.5 కోట్లు), మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం ప్రారంభించామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.14.5 కోట్లు మంజూరు చేయించామని, ఆ ప్రాజెక్టు ప్రస్తుతం ముందుకు సాగడం లేదని విమర్శించారు.

సుమారు 6,500 ఇళ్లు మంజూరు చేయించామని, టిడ్కో కింద 972 ఇళ్లు పూర్తయినా లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతోందన్నారు. హైవే పక్కన 150 ఎకరాల్లో జగనన్న స్మార్ట్‌ లేఅవుట్‌, రామకృష్ణాపురంలో 62 ఎకరాల్లో పారిశ్రామిక ఎస్టేట్‌కు శంకుస్థాపన చేశామని వివరించారు.

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి విషయంలో 2007లో మంజూరైన ఈ ప్రాజెక్టుకు భూసేకరణ సమస్యలను పరిష్కరించి, పరిహారం చెల్లించి, కాంట్రాక్టు ఒప్పందం చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రాలు చూపిస్తామన్నారు. ప్రభుత్వం మారకపోతే మరో 3–6 నెలల్లో పనులు పూర్తయ్యేవని, ఇప్పుడు ఇతరులు క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

మద్యం దుకాణాల్లో సీసాపై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారని, ఇలా ఐదేళ్లలో సుమారు రూ.60 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని ఆరోపించారు. దీనిని ప్రశ్నించిన యువకుడిపై కేసు పెట్టారని, ఆందోళన సమయంలో తనపై హత్య కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఈ వసూళ్లు మళ్లీ మొదలవుతాయని, ప్రజలు ఓటుతో తీర్పు చెప్పాలని కోరారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, శిష్టు గోపీ, బడగల బాలచంద్రుడు, బెల్లాల శ్రీనివాసరావు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.