Bharat Aawaz

పోలీస్ బలగానికి కొత్త బలం.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
5 min read
0
Comments
154
Views

● 376 మంది సిబ్బంది.. 103 వాహనాల పునఃకేటాయింపు

● వనరుల సద్వినియోగంతో ప్రభుత్వానికి రూ.90 కోట్ల ఆదా

● 93 వేల పోలీస్ బలగంపై హేతుబద్ధీకరణకు కసరత్తు.

అల్వాల్, సెప్టెంబర్ 18: తెలంగాణ పోలీస్ శాఖలో నెలవారీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ అధ్యక్షతన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 

గత కొన్ని నెలలుగా చేపట్టిన విధానపరమైన చర్యలతో పాటు శాఖలోని వివిధ పరిపాలనా, కార్యాచరణ అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన భద్రతా అవసరాలు తగ్గిన నేపథ్యంలో అదనపు భద్రతా సిబ్బందిని ఉపసంహరించడంతో 376 మంది సిబ్బంది అందుబాటులోకి వచ్చినట్లు సమావేశంలో వెల్లడించారు. 

వీరితో పాటు 20 బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, 7 ఫార్చ్యూనర్ వాహనాలు, 18 ఇన్నోవా క్రిస్టాలు, మరో 58 నాలుగు చక్రాల వాహనాలను అవసరమున్న విభాగాలు, సంస్థలకు పునఃకేటాయించినట్లు తెలిపారు.

గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 573 మంది సిబ్బందికి చెల్లిస్తున్న 60 శాతం అదనపు వేతనాన్ని నిలిపివేయడం ద్వారా వారిని ఏసీబీ, సీఐడీ, నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్, ఫుడ్ అడల్టరేషన్, ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ వంటి అవసరమున్న విభాగాలకు కేటాయించినట్లు తెలిపారు.

ఈ చర్య ద్వారా సుమారు రూ.28.16 కోట్ల ఆదా కాగా, ఇలాంటి ఇతర చర్యలతో ప్రభుత్వానికి కలిగిన మొత్తం ఆదా సుమారు రూ.90 కోట్లకు చేరినట్లు వెల్లడించారు.

ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖలో మంజూరైన 93 వేల సాంక్షన్డ్ స్ట్రెంత్‌ను హేతుబద్ధీకరించే అంశంపైనా సమావేశంలో చర్చించారు.

కొత్తగా ఏర్పడుతున్న విభాగాలు, సిబ్బంది అవసరం ఎక్కువగా ఉన్న సంస్థలకు మానవ వనరులను కేటాయించే అంశంపై సమీక్షించారు.

వచ్చే నెలలో తెలంగాణ పోలీస్ ఆతిథ్యం ఇవ్వనున్న సదరన్ స్టేట్స్ డీజీపీల కాన్ఫరెన్స్ (RPCC) ఏర్పాట్లపైనా చర్చించారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘానికి కొత్త కార్యవర్గం ఎన్నిక, పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు FitCopను శాఖ మొత్తం అమలు చేయడం, గత ఏడాది నిర్వహించిన TG Police Retreat నిర్ణయాల అమలు పురోగతి, ఈ ఏడాది రిట్రీట్ అజెండాపై చర్చ జరిగింది.

1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారుల పదోన్నతుల అంశంపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కొత్త TG Police Manual, Compendiums తుది రూపకల్పన, ఐపీఎస్ ఖాళీలు, పోస్టింగ్స్, ముఖ్యంగా ఐజీ, అంతకంటే పైస్థాయి పోస్టులకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.

CURE పరిధిలోని నాలుగు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ మూడో వారంలో నిర్వహించనున్న కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాలు, శాఖకు సంబంధించిన వివిధ బడ్జెట్, పరిపాలనా అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి.

సీనియర్ పోలీస్ అధికారులు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశాలు అవకాశం కల్పిస్తాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. 

అధికారుల అభిప్రాయాల ఆధారంగా ఏకాభిప్రాయంతో పరిపాలనా నిర్ణయాలు తీసుకుని, వాటిని సమష్టి నిబద్ధతతో అమలు చేసేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal