అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు.

0
117

 

అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు

 

Andhra

Chandrababu Naidu invites Singapore investors to choose Amaravati as their second home

సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో బిజినెస్ రోడ్ షో

హాజరైన సీఎం చంద్రబాబు

'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఏపీకి పేటెంట్ ఉందన్న సీఎం

విశాఖ సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో బిజినెస్ రోడ్ షో

పెట్టుబడులకు ఏపీ అత్యంత సురక్షితమైన ప్రాంతమని వెల్లడి

భారత్‌కు ఏపీ ఎకనమిక్ పవర్‌హౌస్‌గా మారుతుందని ధీమా

ఆంధ్రప్రదేశ్‌ను, ముఖ్యంగా రాజధాని అమరావతిని తమ రెండో నివాసంగా ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పారిశ్రామికవేత్తలకు సాదరంగా పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలమైన, సురక్షితమైన గమ్యస్థానమని, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు తమ ప్రభుత్వమే పేటెంట్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "సింగపూర్‌తో భారత్‌కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు మూడు దశాబ్దాలుగా బలమైన అనుబంధం ఉంది. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ నాకు స్ఫూర్తి. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. ఇప్పుడు అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధిలోనూ సింగపూర్‌తో కలిసి పనిచేస్తున్నాం. భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం" అని అన్నారు.

 

పరిశ్రమలకు శరవేగంగా అనుమతులు 

రాష్ట్రంలో పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతులు అత్యంత వేగంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. "ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిట్టల్‌కు అతి తక్కువ సమయంలోనే అన్ని అనుమతులు ఇచ్చాం. 2028 నాటికి ఆ సంస్థ ఉత్పత్తి ప్రారంభించి ఏపీ నుంచి ఎగుమతులు చేస్తుంది. అలాగే గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు కాబోతోంది. దానికి గ్రీన్ ఎనర్జీ సరఫరా చేస్తాం. గూగుల్‌తో పాటు మరో 10 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ కంపెనీలు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రూ.7 వేల కోట్లతో శ్రీసిటీలో గృహోపకరణాల యూనిట్ ప్రారంభిస్తోంది" అని వివరించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఆపరేషనల్ స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

 

భవిష్యత్ భారత్‌కు ఏపీ పవర్‌హౌస్ 

'వికసిత్ భారత్ 2047' స్ఫూర్తితో 'స్వర్ణాంధ్ర 2047' విజన్‌కు రూపకల్పన చేశామని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్.. భారత ఆర్థిక వ్యవస్థకు పవర్ హౌస్‌గా మారుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. "సుదీర్ఘ తీరప్రాంతం, అపార ఖనిజ సంపద, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం. ఆక్వా, హార్టికల్చర్, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే కీలకంగా ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాలు ఉండటం మనకు కలిసొచ్చే అంశం. ఏపీ నుంచి ఎగుమతులు పెంచేందుకు పోర్టులు, ఎయిర్‌పోర్టులను సిద్ధం చేస్తున్నాం" అని అన్నారు.

 

నాలెడ్జ్ హబ్‌గా అమరావతి

అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. "అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు కలిసి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కలిపేలా హైస్పీడ్ రైల్ నెట్వర్క్‌ను అమరావతికి అనుసంధానిస్తాం. ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం" అని వివరించారు.

 

అభివృద్ధిలో దూసుకెళుతున్న ఏపీ

​ రాష్ట్రంలో 6 ఆపరేషనల్ పోర్టులు, 7 ఎయిర్‌పోర్టులు ఉన్నాయని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో గ్లోబల్ నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమల కోసం 26 ప్రత్యేక పాలసీలు అమలు చేస్తున్నామని, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. "ఏపీకి వచ్చి మా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను స్వయంగా పరీక్షించి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావడానికి ఇదే సువర్ణావకాశం" అని చంద్రబాబు పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ సమావేశంలో మంత్రి పి.నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...
By Ratna Sekhar 2026-02-19 19:01:51 0 192
Andhra Pradesh
మరి కాసేపట్లోజూరిచ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దావోస్   • *కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*   •...
By Rajini Kumari 2026-01-19 11:42:14 0 191
Meghalaya
Meghalaya's Living Root Bridges Earn Wider Recognition
Meghalaya's iconic Living Root Bridges continue to receive national and international recognition...
By Fathima Safa 2026-07-01 10:51:57 0 84
Andhra Pradesh
బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు...
By Pagadala Venkateswar 2026-06-19 04:40:39 0 105
Andhra Pradesh
మదనపల్లెలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వరుస దొంగతనాలు.
మదనపల్లెలో ప్రైవేట్ ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఒక దొంగ వరుస చోరీలకు పాల్పడుతున్నాడు....
By Pagadala Venkateswar 2026-03-20 09:37:49 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com