రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్.

0
127

 

రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్

Andhra

Nara Lokesh Slams Jagan as Cancer to Rayalaseema

తల్లిని, చెల్లిని తరిమేసి బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్ అంటూ లోకేష్ ఫైర్

రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర విమర్శ

2029లోపు కడప స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామని హామీ

కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఫేక్ ఖాతాలతో కుట్ర

గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటూ సంక్షేమ, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు

ఇవాళ జగన్ ప్రెస్ మీట్ చూశాక ఆయనకు ‘చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ ఇవ్వొచ్చనిపించిందని, ఆయన అద్భుత నటనకు ‘భాస్కర్ అవార్డు’ గ్యారంటీ అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, జగన్‌పై, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత కుటుంబాన్నే కాకుండా, సొంత జిల్లాను, నియోజకవర్గాన్ని కూడా జగన్ మోసం చేశారని ఆరోపించారు.

 

జగన్ కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. తల్లిని, చెల్లిని తరిమేశారని, బాబాయిని లేపేసి మరో చెల్లి కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. "2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్. మొదట గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలి వేటు అని బయటకు వచ్చింది. ఆ తర్వాత దొంగ పేపర్‌లో నారాసుర రక్తచరిత్ర అని రాసి చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఫోటో వేశారు. కానీ, జగన్ ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైంది. అందుకే వైసీపీకి ముద్దుగా గొడ్డలి పార్టీ అని పేరు పెట్టాం" అని లోకేష్ అన్నారు. 

 

జగన్ నటన చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తుందని, బయట ముద్దులు పెట్టి లోపల గొడ్డలి పోట్లు వేయడం ఆయనకు అలవాటని వ్యాఖ్యానించారు. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని, రియల్ ఎస్టేట్ వ్యాపారి దస్తగిరిని జగన్ మేనమామ చంపేసి, తమపై కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదని, ఇప్పుడు కేసులకు భయపడతామా అని ప్రశ్నించారు. కడపలో ఒక పెద్దాయన ఎగిరెగిరి పడుతున్నారని, త్వరలో ఆయన సమయం కూడా వస్తుందని, చట్టాలను ఉల్లంఘించిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

 

2029 లోగా కడప స్టీల్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని లోకేష్ ప్రజలను ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే బాధితులను పట్టించుకోలేదని విమర్శించారు. "యువగళం పాదయాత్రలో ఇదే కడప గడ్డపై నేను మిషన్ రాయలసీమను ప్రకటించాను. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తానని మాట ఇచ్చి, ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం. గత రెండేళ్లలో రూ.లక్ష కోట్ల విలువైన పరిశ్రమలు రాయలసీమకు తెచ్చాం. 2029 ఎన్నికలలోపు కడప స్టీల్ ప్లాంట్‌లో కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటా," అని లోకేష్ హామీ ఇచ్చారు.

 

కూటమి మధ్య చిచ్చుకు సైకో బ్యాచ్ కుట్ర

కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సైకో బ్యాచ్ కుట్రలు పన్నుతోందని లోకేష్ ఆరోపించారు. "జనసేన ముసుగులో మనల్ని, టీడీపీ ముసుగులో జనసేనను ఫేక్ అకౌంట్లలో తిడతారు. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కూటమి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా జగన్ ముఠా కుట్రలను తిప్పికొట్టాలి," అని పిలుపునిచ్చారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని, పల్నాడులో తోట చంద్రయ్య వంటి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.

 

చేసిన మంచిని చెప్పాల్సిన బాధ్యత కేడర్ దే

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని, దీని కోసమే ఏటా రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకార భరోసా, చేనేత, మరమగ్గాలకు ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 16 వేల టీచర్ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేశామని, ఉగాదికి 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని గుర్తు చేశారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని సూచించారు.

 

కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలి

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేందుకు పాస్‌పోర్టు మాత్రమేనని, కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మమేకం కావాలని లోకేష్ హితవు పలికారు. టీడీపీ కేడర్‌పై గత పాలకులు పెట్టిన తప్పుడు కేసులను తొలగించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. "మా చుట్టూ తిరిగితే పదవులు రావు, ప్రజల చుట్టూ తిరిగితే పదవులు వెదుక్కుంటూ వస్తాయి. పనిచేసే వారిని గుర్తించడానికే మైటీడీపీ యాప్ తీసుకువచ్చాం" అని తెలిపారు.

 

వర్చువల్ మహానాడును విజయవంతం చేయండి

అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పిలుపు మేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో వర్చువల్‌గా నిర్వహిస్తున్నామని లోకేష్ తెలిపారు. ప్రతి క్లస్టర్‌లో కార్యకర్తలను సమీకరించి మహానాడును విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన బాధ్యత మరింత పెరిగిందని, తనకు అప్పగించిన ప్రతి పనినీ చిత్తశుద్ధితో చేస్తానని అన్నారు.

 

గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండండి

నాయకులు, కార్యకర్తలు గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలని లోకేష్ గట్టిగా సూచించారు. పార్టీ శాశ్వతమని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దని కోరారు. అధికారం వచ్చిందని అహంకారం చూపొద్దని, ప్రజలు ప్రతి కదలికను గమనిస్తున్నారని హెచ్చరించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి 2029లో ఎన్డీఏను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి కోరినట్లు కడపలోని అర్బన్ పాఠశాలలకు మౌలిక వసతులు, చెరువుల ఆధునీకరణకు నిధులు కేటాయించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 

కడపలో మంత్రి నారా లోకేష్ 89వ రోజు ప్రజాదర్బార్

 

నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం అనంతరం నారా లోకేష్ 89వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కులగణన నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

 

భూనిర్వాసిత కోటాలో నియమితులైన జేపీఏ ఉద్యోగుల సీనియారిటీని యథావిధిగా వన్ టైం బేసిస్ భూ నిర్వాసితుల ప్రాధాన్యత కోటా కింద కొనసాగించాలని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసిత రైతుల హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణంలోని ప్రమీలా నగర్ లో రోడ్డు ఆక్రమణకు గురైందని, సర్వే నిర్వహించి దారి ఏర్పాటుచేయాలని పట్టణానికి చెందిన హేమాద్రి కోరారు. 

 

కడప జిల్లా, పట్టణంలో బలిజ భవనానికి 50 సెంట్ల స్థలం కేటాయించడంతో పాటు బలిజ కాపులకు ఈడబ్ల్యూఎస్ కింద 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని జిల్లా బలిజ సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:31 0 85
Andhra Pradesh
ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష మోసం: మేజారి మురళీధర్‌పై సత్య ఆరోపణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష తీసుకుని మోసం చేశాడని మేజారి...
By Pagadala Venkateswar 2026-05-01 04:04:53 0 148
Andhra Pradesh
రైతుల సమస్యలు పరిష్కరిం చెందుకు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే సుజనా చౌదరి
.అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.....
By Rajini Kumari 2026-03-28 14:22:35 0 259
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో...
By John Baji 2025-12-30 12:05:33 0 417
Andhra Pradesh
మదనపల్లిలో టమోటా పంట దగ్ధం: కన్నీరుమున్నీరవుతున్న రైతు
మదనపల్లి మండలం మిట్టపల్లిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటలకు రైతు పూల వెంకటప్ప...
By Pagadala Venkateswar 2026-02-26 11:10:54 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com