ప్రభుత్వ పనితీరు ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించాలి: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు.

0
186

 

 

ప్రభుత్వ పనితీరు ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించాలి: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

13-04-2026 Mon 20:54 | Andhra

Chandrababu Naidu Focuses on Government Performance at Ground Level

రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షేత్రస్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, పట్టణాల్లో మౌలిక వసతులు, మహిళల భద్రత, అన్న క్యాంటీన్ల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పనితీరు ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించాలని, ఫిర్యాదులకు ఆస్కారం లేని పాలన అందించాలని ఆయన స్పష్టం చేశారు.

 

పాఠశాలలు తెరిచేనాటికి హాస్టళ్లు సిద్ధం 

 

జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు పూర్తిస్థాయి వసతులతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. హాస్టళ్లలో టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలు కచ్చితంగా పనిచేయాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని స్పష్టం చేశారు. 

 

"హాస్టళ్ల వసతుల మెరుగుదలకు 'సాస్కీ' నిధులు కేటాయించాం. నిధులు ఇచ్చినా పనులు జరగకపోతే అది అధికారుల వైఫల్యమే అవుతుంది. వసతులు కల్పించడంతో పాటు, వాటి నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆహారం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయంలో ఏమాత్రం తేడా రాకూడదు," అని ఆయన హెచ్చరించారు. ఉన్నతాధికారులు తరచూ హాస్టళ్లను తనిఖీ చేయాలని సూచించారు.

 

పట్టణాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి 

 

నగరాలు, పట్టణాల్లో తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. పైప్‌లైన్లలోకి డ్రైనేజీ నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, తరచూ నీటి నమూనాలను పరీక్షించాలని ఆదేశించారు. 

 

వీధి దీపాలు నిరంతరం వెలగాలని, చెత్త సేకరణ ఎక్కడా ఆగకూడదని చెప్పారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి, పరిష్కరించే వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. "పని పూర్తయ్యాక స్థానికుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. ప్రభుత్వం వెంటనే స్పందించిందనే భావన ప్రజల్లో కలగాలి. పారిశుద్ధ్య నిర్వహణలో తాడిపత్రి ఆదర్శంగా నిలుస్తోంది. స్థానిక నేతలు చొరవ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి" అని చంద్రబాబు అన్నారు.

 

మహిళల భద్రతే ప్రథమ ప్రాధాన్యత 

 

మహిళలు, చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. "మహిళల జోలికి రావాలన్నా, అఘాయిత్యం చేయాలనే ఆలోచన రావాలన్నా నేరస్థులు వణికిపోవాలి. తప్పు చేసిన వారిని అరెస్టు చేయడమే కాదు, వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలి. మహిళల్లో భయాన్ని పోగొట్టి, తప్పు చేసేవారిలో భయాన్ని పెంచాలి" అని ఆయన అన్నారు. 

 

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని, గత ప్రభుత్వంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడిందని, దీన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశించారు. గంజాయి నివారణకు రాష్ట్రంలో అమలు చేస్తున్న 'ఈగల్' విధానాన్ని ఒడిశా ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

 

పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లు 

 

పేదవాడి ఆకలి తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ముఖ్యమంత్రి, అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా ఈ క్యాంటీన్లను విస్తరించనున్నట్లు తెలిపారు. వీటి నిర్వహణ కోసం ఏడాదికి సుమారు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేందుకు దాతలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. పేదలు సంతృప్తిగా, కడుపునిండా భోజనం చేసేలా క్యాంటీన్లను నిర్వహించాలని, అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.

 

ఆవిష్కరణలు, సాంకేతికతపై సరికొత్త ప్రణాళికలు

 

రాష్ట్రాన్ని ఆవిష్కరణల కేంద్రంగా మార్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ద్వారా విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణల ఆలోచనలను ప్రోత్సహించాలన్నారు. అగస్త్య ఫౌండేషన్ వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని, 175 నియోజకవర్గాల్లోని ఎంఎస్ఎంఈ పార్కులతో ఆర్టీఐహెచ్‌ను అనుసంధానించాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అల్లూరి, మన్యం, పోలవరం జిల్లాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించే పైలట్ ప్రాజెక్టును చేపట్టాలన్నారు. 

 

‘జలధార’ కార్యక్రమాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించి సమర్థవంతంగా అమలు చేయాలని, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ఆదేశించారు. చెరువులు నింపే విషయంలో అన్నమయ్య జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని, అవసరమైతే ఇతర జిల్లాల బృందాలకు అక్కడ శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బోయిన్‌పల్లిలో కళ్లజోళ్ల దుకాణంలో అగ్ని ప్రమాదం.|
సికింద్రాబాద్‌ : బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది....
By Sidhu Maroju 2026-03-28 09:30:05 0 204
SURAKSHA
Large-Scale Recruitment of Police Constables
o strengthen law and order, the Karnataka Police has launched a major recruitment drive for 3,395...
By Kalaga Sailaja 2026-06-29 09:19:49 0 140
Andhra Pradesh
అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్‌ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం.
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి...
By Pagadala Venkateswar 2026-06-12 11:11:36 0 129
BMA
Expendable Voices: The Crisis of Rural News Stringers
The backbone of national news relies entirely on mofussil "stringers"—freelance village and...
By JoinBMA 2026-08-21 09:51:31 0 79
Andhra Pradesh
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు.
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనాని Both States Tirumala Queue Lines...
By Pagadala Venkateswar 2026-05-25 04:51:10 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com