Bharat Aawaz

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
241
Views

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.

జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం సరుబుజ్జిలి మండలం బొప్పడం గ్రామంలో, కాశీబుగ్గ పట్టణంలో ఈ తనిఖీలు జరిగాయి. సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, అక్రమ కార్యకలాపాలపై సోదాలు నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

అనుమానాస్పద వ్యక్తులు, గుర్తుతెలియని వాహనాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గంజాయి, అక్రమ మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా లేదా విక్రయాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.