Bharat Aawaz
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం కృషి చేస్తోందని నగర మేయర్ *శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్* గారు పేర్కొన్నారు.

ఇటీవల నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్‌కు కేటాయించిన రూ. 20 లక్షల నిధుల కార్యాచరణలో భాగంగా, ఈరోజు నగరంలోని డివిజన్ నంబర్ 22, 25, 35 పరిధిలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్లతో కలిసి భూమిపూజ నిర్వహించి, పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ...
నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి డివిజన్‌కు రూ. 20 లక్షల నిధులను వెచ్చించి డ్రైనేజీలు, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం వంటి అత్యవసర ప్రజా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శ్రీ ఎర్రం సుధీర్ గారు, శ్రీమతి వైష్ణవి సుధా గారు, శ్రీ చింతకాయల రాజేందర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, నాయకులు మరియు ఆయా కాలనీల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినందుకు స్థానిక ప్రజలు మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
9 Views