Bharat Aawaz
నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మదనపల్లెకు చెందిన మార్పూరి శ్రీరామ్‌కు సంబంధించిన భూమిని ఆయన పెద్దనాన్న కుమారుడు మార్పూరి వెంకటేష్ 2023లోనే రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ పత్రాల ఆధారంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నిందితులు సదరు భూమిలోకి ప్రవేశించి, అక్కడి ఆస్తులను ధ్వంసం చేసి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పీటీ వారెంట్‌పై ముగ్గురి అరెస్ట్
ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇతర కేసులకు సంబంధించి మదనపల్లె సబ్‌జైలులో ఉన్న నిందితులపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో రౌడీషీటర్ కోనేటి సులోచన, ఆమె అనుచరుడు గుండిగల మోహన్, రియల్టర్ కడియాల శ్రీరాములునాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మదనపల్లె టూటౌన్ ఎస్ఐ నాగేశ్వర్‌రావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భూ ఆక్రమణ వ్యవహారంలో మరో ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోందని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
23 Views