Bharat Aawaz
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన జనసేన, తాజాగా జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లోనూ అదే జోరును ప్రదర్శించింది. ఏకంగా 100 శాతం స్ట్రైక్ రేట్‌తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన అన్ని స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది.

కూటమి ఒప్పందం ప్రకారం.. జనసేన పార్టీకి మొత్తం 4 మున్సిపల్ కార్పొరేషన్లు (మేయర్ స్థానాలు), 21 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు (ఛైర్‌పర్సన్ స్థానాలు) దక్కాయి. వీటిలో తాజాగా 2 కార్పొరేషన్లు (విజయవాడ, ఏలూరు), 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.

ఈ 20 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులే గెలుపొందడం విశేషం. ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ, ఏలూరు మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి అప్పలనాయుడు ఘన విజయం సాధించి పార్టీకి కీలక విజయాలను అందించారు.

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను జనసేన కైవసం చేసుకుంది. పిఠాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి దానం లాజర్‌బాబు వైసీపీ అభ్యర్థిపై 9,235 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి 36 వార్డుల్లో 3 జనసేనకు ఏకగ్రీవం కాగా, మిగిలిన వాటిలో జనసేన 16, టీడీపీ 5, బీజేపీ 1, వైసీపీ 1 గెలుచుకున్నాయి. 10 మంది స్వతంత్రులు గెలవగా, వారిలో 8 మంది కూటమి రెబల్స్ కావడం గమనా
ర్హం.
69 Views